హైద‌రాబాద్‌లో ప‌బ్‌ల‌పై ఆంక్ష‌లు స్వేచ్ఛను హ‌రించ‌డ‌మే: రాంగోపాల్ వ‌ర్మ

  • ప‌బ్‌ల‌పై ఆంక్ష‌లు విధించిన తెలంగాణ హైకోర్టు
  • ఆంక్ష‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన డెక్క‌న్ క్రానిక‌ల్ రెసిడెంట్ ఎడిట‌ర్ శ్రీరామ్‌
  • శ్రీరామ్ ట్వీట్‌తో ఏకీభ‌విస్తూ వ‌ర్మ ట్వీట్‌
  • అణ‌చివేయాల‌ని చూస్తే ప్ర‌తికూల ఫ‌లితాలు వస్తాయ‌న్న ద‌ర్శ‌కుడు
హైద‌రాబాద్‌లో ప‌బ్‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌గా... వాటిని పక్కాగా అమ‌లు చేస్తున్న పోలీసులు.. ఏమాత్రం నిబంధ‌న‌లు అతిక్ర‌మించినా కేసులు పెడుతున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై డెక్క‌న్ క్రానిక‌ల్ రెసిడెంట్ ఎడిట‌ర్ శ్రీరామ్ క‌ర్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. మ‌ధ్య రాత్రి వ‌ర‌కు ప‌బ్‌ల‌లో మ్యూజిక్‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న కోరారు. యూత్‌ఫుల్ సిటీగా ఉన్న హైద‌రాబాద్‌లో ఈ త‌ర‌హా నిబంధ‌న‌లు ఏమిటంటూ ఆయ‌న ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

శ్రీరామ్ ట్వీట్‌పై తాజాగా సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ స్పందించారు. ప‌బ్‌ల‌పై ఆంక్ష‌ల విష‌యంలో శ్రీరామ్ చేసిన వాద‌న క‌రెక్టేన‌న్న రీతిలో వ‌ర్మ స్పందించారు. ప‌బ్‌లలో మ్యూజిక్ ఎప్ప‌టిదాకా కొన‌సాగించాల‌న్న విష‌యాన్ని వాటి య‌జ‌మానులు, కస్ట‌మ‌ర్ల‌కే విడిచిపెట్టాల‌ని వ‌ర్మ అభిప్రాయ‌ప‌డ్డారు. సంతోష స‌మ‌యాల‌పై నిషేదాజ్ఞ‌లు విధించడ‌మంటే స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని వ‌ర్మ పేర్కొన్నారు. ప‌బ్ క‌ల్చ‌ర్‌పై ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. అలా కాకుండా యువ‌త ఆనందాన్ని బ‌ల‌వంతంగా అణ‌చాల‌ని చూస్తే ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని వ‌ర్మ అన్నారు.


More Telugu News