శశిథరూర్ తో నన్ను పోల్చొద్దంటున్న మల్లికార్జున్ ఖర్గే

  • తాను కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి వచ్చానని వెల్లడి
  • కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న థరూర్, ఖర్గే
  • ఇద్దరూ తమ మేనిఫెస్టోలను ప్రకటించి ప్రచారం
చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ కు గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నాడు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులు, ఎంపీలు శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పీఠం కోసం జరిగే ఎన్నికల కోసం ఈ ఇద్దరూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాము అధ్యక్ష పీఠం అందుకుంటే చేయబోయే పనుల గురించి వివరించి తమకు ఓటు వేయాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో అధికారాన్ని వికేంద్రీకరించడానికి కృషి చేస్తానని శశి థరూర్ చెప్పారు.

దీని గురించి మల్లికార్జున్ వద్ద ప్రస్తావిస్తే.. తమ ఇద్దరినీ పోల్చి చూడటం తనకు ఇష్టం లేదన్నారు. ఓ ఇంగ్లిష్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను థరూర్‌తో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీ పనితీరును సంస్కరించాలనే థరూర్  మేనిఫెస్టోపై మాట్లాడిన ఆయన ‘నేను స్వయంగా బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి వచ్చా, ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా?’ అని ప్రశ్నించారు. థరూర్ కు తన మేనిఫెస్టోతో ముందుకు వెళ్లే స్వేచ్ఛ ఉందని ఖర్గే చెప్పారు.  తనకు మాత్రం ‘ఉదయపూర్ డిక్లరేషన్’ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు, నిపుణులందరినీ సంప్రదించిన తర్వాతే  పార్టీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. 

 ప్రస్తుత సంక్షోభం నుంచి కాంగ్రెస్ బయటపడేసి, పార్టీలో మార్పు తీసుకురావడానికి యువ నాయకత్వం అవసరమా? అని అడిగిన ప్రశ్నకు ఖర్గే తనదైన శైలిలో స్పందించారు. పార్టీలో ఎవరేంటి? ఎవరి స్థానం ఏమిటో తెలిసిన మనిషిని తాను అని చెప్పారు. అవసరం అయిన చోట వారి సేవలను వినియోగించుకుంటానని తెలిపారు.


More Telugu News