పిటిషన్ కు జోడించిన ఫొటో అభ్యంతరకరంగా ఉందంటూ న్యాయవాదులకు రూ.25 వేలు జరిమానా వడ్డించిన బాంబే హైకోర్టు

  • ఇద్దరు న్యాయవాదుల ద్వారా పిటిషన్ వేసిన మహిళ
  • పిటిషన్ కు జోడించిన ఫొటోపై బాంబే హైకోర్టు అభ్యంతరం
  • పిటిషనర్ల గోప్యతకు భంగం కలిగించేలా ఉందని వెల్లడి
ఓ పిటిషన్ కు జోడించిన మహిళ ఫొటో అభ్యంతరకరంగా ఉందంటూ బాంబే హైకోర్టు ఆనంద్ దేశ్ పాండే, రమేశ్ త్రిపాఠీ అనే న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి రూ.25 వేల జరిమానా విధించింది. 

ఓ కేసు విషయమై ఒక మహిళ ఆ ఇద్దరు న్యాయవాదుల ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ కు జోడించిన ఫొటో పట్ల హైకోర్టు ఆక్షేపించింది. 

ఈ కేసుతో సంబంధం ఉన్న అనేకమంది వద్దకు ఈ ఫొటో వెళుతుందని, తన క్లయింటు గోప్యతను కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదిపై ఉంటుందని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ ఎస్ఎం మోదక్ లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి ఫొటోలను జోడించిన పిటిషన్లు కోర్టులోనే వివిధ డిపార్టమెంట్ల వద్దకు వెళుతుంటాయని, ఇది పిటిషనర్ల గోప్యతకు భంగం కలిగించినట్టేనని పేర్కొంది. 

డివిజన్ బెంచ్ జరిమానా నేపథ్యంలో, అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా (ఏఏడబ్ల్యూఐ) తన పరిధిలోని న్యాయవాదులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. క్లయింట్లకు సంబంధించి అభ్యంతరకర, అశ్లీలంగా ఉన్న ఫొటోలను పిటిషన్లకు జోడించవద్దని న్యాయవాదులకు సూచించింది. ఒకవేళ అలాంటి ఫొటోలను సమర్పించడం తప్పనిసరి అయితే, విచారణ సమయంలో నేరుగా ధర్మాసనానికే అందజేయాలని స్పష్టం చేసింది.


More Telugu News