చనిపోయిన కూతురికి పంచలోహ విగ్రహం... ఓ తండ్రి భావోద్వేగ గాథ

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • చినబాబు, దుర్గాదేవి దంపతులు
  • పదేళ్ల కిందట మరణించిన కుమార్తె ప్రసన్న జ్యోతి 
  • తీవ్రంగా కుంగిపోయిన చినబాబు
  • మానసిక ప్రశాంతత కోసం పుణ్యక్షేత్రాల సందర్శన
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చినబాబు, దుర్గాదేవి దంపతులకు పదేళ్ల కిందట పుత్రికా వియోగం కలిగింది. వారి కుమార్తె ప్రసన్న జ్యోతి 18 ఏళ్ల వయసులో కన్నుమూసింది. కుమార్తెను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే చినబాబుకు ఈ సంఘటనతో గుండె పగిలినంతపనైంది. 

కుమార్తె మరణంతో కుంగిపోయిన ఆయన మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు చాలాకాలం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం చినబాబు, తన భార్యతో కలిసి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడెక్కడో తిరిగారు. ఆ క్రమంలోనే కాశీ క్షేత్రానికి వెళ్లగా, ఓ సాధువు చెప్పిన మాటలతో ఆయనలో ఉత్సాహం కలిగింది.

"నీ కుమార్తె అమ్మవారి ప్రతిరూపం. పంచలోహాలతో నీ కుమార్తె విగ్రహం తయారుచేయించి, పూజా కార్యాక్రమాలు నిర్వహించు" అని ఆ సాధువు సూచించారు. ఆయన మాటలపై నమ్మకం ఉంచిన చినబాబు.... పంచలోహాలతో కుమార్తె విగ్రహం చేయించి తన కుమార్తెకు ఎంతో ఇష్టమైన గదిలోనే ప్రతిష్టించారు. అప్పటి నుంచి తనకు ఎంతో ప్రశాంతత చేకూరిందని చినబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

కుమార్తె పేరిట తన శక్తిమేరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నానని తెలిపారు. తన కుమార్తె ఎల్లప్పుడూ తన వెంటే ఉందని భావిస్తానని, తాను మంచిపనులు చేసేలా ఆమె ప్రోత్సహిస్తుంటుందని నమ్ముతానని చినబాబు పేర్కొన్నారు. 

అంతేకాదు, ఏదైనా ముఖ్యమైన పని చేపట్టేటప్పుడు కుమార్తె విగ్రహం ముందు ప్రార్థిస్తానని వెల్లడించారు. మా అమ్మాయి నన్ను మా అమ్మ కంటే బాగా చూసుకునేది అని చెబుతూ ఆయన భావోద్వేగాలకు గురయ్యారు.


More Telugu News