తెలంగాణ స‌ర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం

  • తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌పై వివాదం
  • ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి పోస్టింగ్‌లు ఇవ్వ‌ని తెలంగాణ‌
  • సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఉద్యోగులు
  • కోర్టు ధిక్క‌ర‌ణ కింద విద్యుత్ శాఖ అధికారుల‌ను జైలుకు పంప‌డ‌మొక్క‌టే మార్గ‌మ‌న్న ధ‌ర్మాసనం
  • చివ‌రి అవ‌కాశం ఇస్తున్నామ‌ని హెచ్చ‌రిక‌
  • ఈ నెల 31న మ‌రోమారు సమీక్షిస్తామ‌ని వెల్ల‌డి
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా స‌ర్వోన్నత న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మంది విద్యుత్ ఉద్యోగుల‌కు త‌క్షణ‌మే పోస్టింగ్‌లు ఇవ్వాల‌ని తెలంగాణ‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంలో చివ‌రి అవ‌కాశం ఇస్తున్నామ‌న్న ధ‌ర్మాస‌నం... 2 వారాల్లోగా జ‌స్టిస్ ధ‌ర్మాధికారి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక అమ‌లు అయ్యిందా?, లేదా? అన్న విష‌యంపై ఈ నెల 31న మ‌రోమారు స‌మీక్ష చేపట్ట‌నున్న‌ట్లు కూడా సుప్రీంకోర్టు తెలిపింది. 

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించ‌కుండా త‌మ జీవితాల‌తో రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆట‌లాడుకుంటున్నాయ‌ని ఆరోపిస్తూ విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌ను పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగుల విభ‌జ‌న‌కు సంబంధించి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేర‌కు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగుల‌కు ఏపీ పోస్టింగ్‌లు ఇవ్వ‌గా... ఏపీ నుంచి రిలీవ్ అయిన వారిలో కొంద‌రికి పోస్టులు ఇచ్చిన తెలంగాణ ఇంకో 84 మందికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వ‌లేదు. దీనిపై 84 మంది ఉద్యోగులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

ఉద్యోగులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. కోర్టుల ఆదేశాల‌ను తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేయ‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు ధ‌ర్మాస‌నానికి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో క‌ల‌గ‌జేసుకున్న ధ‌ర్మాస‌నం... ఉద్దేశ‌పూర్వ‌కంగానే కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించారంటూ తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే... కోర్టు ధిక్క‌ర‌ణ కింద విద్యుత్ శాఖ అధికారుల‌కు జైలు శిక్షే ప‌రిష్కార‌మ‌ని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. 84 మంది ఉద్యోగుల‌కు  పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చివ‌రి అవ‌కాశం ఇస్తున్నామ‌ని తెలిపింది.


More Telugu News