బీసీసీఐ చీఫ్ గా రోజర్ బిన్నీ.. కార్యదర్శిగా జైషా! నేడు నామినేషన్లు

  • వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా
  • ఐపీఎల్ చైర్మన్ గా అరుణ్ ధుమాల్
  • ఖరారైన అభ్యర్థిత్వాలు
భారత్ కు 1983 లో ప్రపంచ కప్ తీసుకొచ్చిన హీరోగా పేరొందిన రోజర్ బిన్నీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు కానున్నారు. రాజీవ్ శుక్లా ఎప్పటి మాదిరే వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నారు. ప్రస్తుతం కార్యదర్శిగా జైషా ఉండగా, మరోసారి అదే పదవికి ఆయన పోటీ పడొచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జైషా తదుపరి బీసీసీఐ చీఫ్ అవుతారన్న వార్తలు వచ్చాయి. కానీ, ఇవి నిజం కావని తెలుస్తోంది. 

రోజర్ బిన్నీతోపాటు, బీసీసీఐ ఆఫీసు బేరర్ల పోస్ట్ లకు అభ్యర్థిత్వం ఖరారైన వారు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీసీసీఐ పదవులకు ఎన్నిక ఈ నెల 18న జరగనుంది. జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ట్రెజరర్ గా ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ గా అరుణ్ ధుమాల్ అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. రోజర్ బిన్నీ (67) 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 ఓడీఐలు ఆడారు. 1983 ప్రపంచకప్ లో 8 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలవడం ద్వారా భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించారు.


More Telugu News