కాంగ్రెస్ ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాం: మల్లికార్జున ఖర్గే

  • 50 ఏళ్ల లోపు వారికి పార్టీలో అవకాశం కల్పిస్తామన్న ఖర్గే
  • తనను అధ్యక్ష పదవికి పోటీ చేయమని సోనియా చెప్పారని వ్యాఖ్య
  • అందరిని కలుపుకుని పోతానన్న ఖర్గే
సమష్టి నాయకత్వాన్ని తాను నమ్ముతానని... పార్టీలోని అందరు నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తానని ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేస్తానని... 50 ఏళ్ల లోపు వయసున్న వారికి పార్టీలో అవకాశం కల్పిస్తానని... ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు చోటు కల్పిస్తానని చెప్పారు. 

ఇతర నేతలు తనను అనుసరించాలనే భావన తనకు లేదని... వారంతా తన పక్కన నడవాలని కోరుకుంటున్నానని ఖర్గే తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసి పని చేద్దామని అన్నారు. సోనియాగాంధీ తనను ఆమె నివాసానికి పిలిచి... పార్టీకి నాయకత్వం వహించాలని కోరారని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి ముగ్గురు పేర్లును సూచిస్తానని తాను చెప్పానని... ఇతరుల పేర్లు తనకు అవసరం లేదని, పార్టీ నాయకత్వ బాధ్యతలను మీరే తీసుకోవాలని ఆమె అన్నారని తెలిపారు. 

పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడానికి గాంధీ కుటుంబంలోని వ్యక్తులు ముందుకు రాకపోవడం వల్లే... తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడుదామని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలో ఖర్గేకు పోటీగా శశి థరూర్ ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News