వేర్పాటువాద నేత అల్తాఫ్ షా మృతి

  • ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూసిన అల్తాఫ్
  • కిడ్నీ క్యాన్సర్ తో బాధ పడుతున్న వైనం
  • 2017లో అరెస్ట్ అయిన అల్తాఫ్
కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. అల్తాఫ్ చనిపోయిన విషయాన్ని ఆయన కుమార్తె రువా షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక ఖైదీగా తన తండ్రి చనిపోయారని ఆమె ట్వీట్ చేశారు. తీవ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో 2017లో ఆయన అరెస్ట్ అయ్యారు.

కిడ్నీ క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆయన ఈ నెల ప్రారంభంలో ఎయిమ్స్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. హురియత్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీకి అల్లుడు అల్తాఫ్. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అల్తాఫ్ కుమారుడు అనీస్ ఉల్ ఇస్లామ్ గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయారు. రాష్ట్ర భద్రతకు ఈయన వల్ల ముప్పు ఉండే అవకాశం ఉందనే కారణంతో సెక్షన్ 311 (2) (సీ) కింద ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.


More Telugu News