బీజేపీ షోకాజ్ నోటీసులకు బదులిచ్చిన రాజాసింగ్

  • ఓ మత విశ్వాసాలను కించపరిచాడంటూ రాజాసింగ్ పై ఆరోపణలు
  • సస్పెండ్ చేసిన బీజేపీ 
  • వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
  • హైకమాండ్ కు లేఖ రాసిన రాజాసింగ్
ఓ మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం తెలిసిందే. మతపరమైన వ్యాఖ్యల వ్యవహారంలో రాజాసింగ్ కు బీజేపీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్ఠానం, వివరణ కోరింది. ఈ నోటీసులపై రాజాసింగ్ నేడు బదులిచ్చారు. 

పార్టీ అధినాయకత్వానికి ఓ లేఖ రాశారు. తాను పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టి, జైలుకు పంపించారని రాజాసింగ్ ఆ లేఖలో తెలిపారు. 

ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మతరాజకీయాలు చేస్తోందని వివరించారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని... ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి తనపై 100 కేసులు పెట్టించారని వెల్లడించారు. 

పార్టీ నియమావళికి, సిద్ధాంతాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే వ్యక్తినని, ప్రజలకు, హిందువులకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ బీజేపీ హైకమాండ్ కు విన్నవించుకున్నాడు.


More Telugu News