రాష్ట్రపతికి రెండు సీట్ల ఆవల గవర్నర్ దత్తాత్రేయకు కుర్చీ.. కేంద్రానికి హర్యానా ప్రభుత్వం ఫిర్యాదు

  • చండీగఢ్ ఎయిర్‌షోలో ఘటన
  • హర్యానా రాజ్‌భవన్ అధికారుల వల్లేనన్న ఎయిర్ షో నిర్వాహకులు
  • వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అవమానం జరిగింది. గవర్నర్‌కు జరిగిన అవమానంపై హర్యానా ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చండీగఢ్‌లో శనివారం నిర్వహించిన ఎయిర్‌‌కు రాష్ట్రపతి ద్రౌపది ముుర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారి బన్వరీలాల్ పురోహిత్ రాష్ట్రపతి పక్క సీట్లో కూర్చున్నారు. రాష్ట్ర గవర్నర్‌ను మాత్రం రెండు సీట్ల తర్వాత కూర్చుబెట్టడం ప్రొటోకాల్ వివాదానికి దారి తీసింది. దీంతో తమ గవర్నర్‌కు అవమానం జరిగిందంటూ హర్యానా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

నిజానికి ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి, ప్రధాని కనుక పాల్గొనకపోతే రాష్ట్రపతి పక్కనే ఆ రాష్ట్ర గవర్నర్‌కు సీటు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానాలకు చండీగఢ్ ఉమ్మడి రాజధాని. కాబట్టి రాష్ట్రపతి పక్కన హర్యానా గవర్నర్ కూర్చోవాల్సి ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా రెండు సీట్ల ఆవల దత్తాత్రేయకు సీటు కేటాయించడం వివాదానికి కారణమైంది.

ఈ వివాదంపై ఎయిర్‌షో నిర్వాహకులు స్పందిస్తూ.. హర్యానా రాజ్‌భవన్ సిబ్బంది పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలనే వివరాలను తాము ముందుగానే చండీగఢ్ నుంచి హర్యానా రాజ్‌భవన్‌కు పంపించామని పేర్కొన్నారు. సీటింగును పరిశీలించేందుకు ఎవరూ లేకపోవడంతో ముందుగా కేటాయించిన సీటులో హర్యానా గవర్నర్ కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, ఈ వివరణపై హర్యానా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


More Telugu News