స‌ర్జరీ చేసి క‌డుపులో ఫోర్సెప్స్‌ వ‌దిలేసిన వైద్యులు.. ఐదేళ్లుగా మ‌హిళ న‌ర‌క‌యాత‌న‌

  • కోజికోడ్ ప్ర‌భుత్వ క‌ళాశాల వైద్యుల నిర్వాకం
  • గ‌త నెల శ‌స్త్ర‌చికిత్స చేసి రెండు క‌త్తెర‌ల‌ను తీసేసిన వైద్యులు
  • కేసు పెట్టిన మ‌హిళ‌.. విచార‌ణ‌కు కేర‌ళ ప్ర‌భుత్వం ఆదేశం 
కోజికొడ్‌కు చెందిన 30ఏళ్ల హ‌ర్షిదా ఐదు సంవ‌త్స‌రాలుగా క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతోంది. గత ఆరు నెలలుగా  నొప్పి మ‌రింత ఎక్కువ కావ‌డంతో తగ్గ‌డానికి వైద్యులు ఆమెకు బలమైన యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. అయినా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. డాక్ట‌ర్లు స్కానింగ్ నిర్వ‌హించ‌గా.. ఆమె కడుపులో రెండు క‌త్తెర‌లు (ఫోర్సెప్స్)  ఉన్న‌ట్టు గుర్తించారు. కోజికోడ్ ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీ వైద్యులు శ‌స్త్ర చికిత్స చేసి వాటిని తొల‌గించ‌డంతో హ‌ర్షిదాకు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. 

ఆ ఫోర్సెప్స్ ఐదేళ్లుగా హ‌ర్షిదా క‌డుపులో ఉన్నాయి. వాటిని అలా వ‌దిలేసింది కూడా ఇదే కోజికోడ్ మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కావ‌డం మ‌రో విశేషం. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావ నాళాలను బిగించడానికి సర్జన్లు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. హ‌ర్షిదా 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో మూడోసారి సిజేరియన్ చేయించుకుంది. అంతకుముందు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స‌ర్జ‌రీ చేయించుకున్నాన‌ని ఆమె చెప్పింది.

"మూడవ శస్త్రచికిత్స తర్వాత, నాకు తీవ్రమైన నొప్పి మొద‌లైంది. సిజేరియన్ సర్జరీ వల్లే అనుకున్నాను. నేను చాలా మంది వైద్యులను సంప్రదించాను. లోహపు వస్తువు నా మూత్రాశయాన్ని గుచ్చుతోంది. ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. నొప్పి భరించలేనిదిగా మారింది" అని ఆమె తెలిపింది. దీంతో ఆమె ప్రభుత్వ వైద్య కళాశాలను ఆశ్రయించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి ఫోర్సెప్స్ తీసివేశారు. ఐదేళ్ల క్రితం సర్జరీ చేస్తుండగా శరీరంలో ఫోర్సెప్స్ వదిలేశారని డాక్టర్లపై హర్షినా ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదుపై కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం విచారణకు ఆదేశించారు. త్వరలో నివేదిక సమర్పించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.


More Telugu News