హైకోర్టు ఆదేశాలు బేఖాత‌రు... హైద‌రాబాద్‌లో 3 ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు

  • రాత్రి 10 గంట‌లు దాటితే ప‌బ్‌ల‌లో సౌండ్ వ‌ద్ద‌న్నహైకోర్టు
  • హైకోర్టు ఆదేశాల‌ను బేఖాత‌రు చేసిన అమ్నీషియా,ఎయిర్ లైవ్‌, జీరో 40 ప‌బ్‌లు 
  • కేసులు న‌మోదు చేసిన హైద‌రాబాద్ పోలీసులు
హైద‌రాబాద్ పరిధిలోని ప‌బ్‌ల‌లో రాత్రి వేళ ప‌రిమితికి మించి సౌండ్‌లు వినిపిస్తున్న వైనంపై ఇదివ‌ర‌కే తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇక‌పై రాత్రి 10 గంటలు దాటితే న‌గ‌రంలోని ఏ ప‌బ్‌లో కూడా సౌండ్ వినిపించ‌రాద‌ని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల‌ను ప‌బ్‌లు య‌థేచ్ఛ‌గా ఉల్లంఘిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించిన హైద‌రాబాద్ పోలీసులు శ‌నివారం న‌గ‌రంలోని 3 ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు చేశారు.

న‌గ‌రంలోని అమ్నీషియా, ఎయిర్ లైవ్‌, జీరో 40 ప‌బ్‌లు శుక్ర‌వారం రాత్రి 10 గంట‌లు దాటినా డీజే సౌండ్ల‌తో త‌మ క‌స్ట‌మ‌ర్లను రంజింప‌జేశాయి. ఈ ఘ‌‌ట‌న‌ల‌పై సమాచారం అందుకున్న పోలీసులు 3 ప‌బ్‌ల‌పై కేసులు నమోదు చేశారు. సౌండ్ పొల్యూష‌న్‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాలను బేఖాత‌రు చేసిన కార‌ణంగానే ఈ ప‌బ్‌ల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News