రోజూ ఉదయమే డ్రైఫ్రూట్స్​ తినడం వల్ల ఎన్నో లాభాలు.. నిపుణులు సూచనలివీ..

  • డ్రైఫ్రూట్స్‌ లో ఉండే పోషకాలతో ఉదయం నుంచే శరీరానికి సత్తువ
  • వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లతో శరీరం శుభ్రమవుతుందన్న నిపుణులు
  • రోగ నిరోధక శక్తికి, కేశాల పెరుగుదలకు తోడ్పాటు ఉంటుందని వెల్లడి
  • డ్రైఫ్రూట్స్‌ లోని ఫైబర్‌ వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగి ఉత్సాహంగా ఉంటుందని వివరణ
మన శరీరానికి అత్యుత్తమ పోషకాలను అందించే ఎండు పండ్లు, గింజలే డ్రైఫ్రూట్స్‌. సాధారణ పోషకాలతోపాటు మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. కొన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ తో కొన్ని రకాల లాభాలు ఉంటే.. మరికొన్నింటితో ఇతర భిన్నమైన ప్రయోజనాలు సమకూరుతాయి. రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం ద్వారా.. శరీరంలో జీవక్రియలు వేగం పుంజుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేరుగా తినడమేగాకుండా సలాడ్లు, ఇతర ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ సమకూరుతాయని వివరిస్తున్నారు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
రోజూ ఉదయమే డ్రైఫ్రూట్స్‌ తినడం వల్ల శరీరానికి అవసరమైన అత్యంత ఆవశ్యక పోషకాలు అందుతాయి. వీటిలోని పొటాషియం, ఐరన్‌, ఫోలేట్‌, క్యాల్షియం, మెగ్నీషియంలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కేశాల పెరుగుదలకు తోడ్పాటు
బాదాం వంటి డ్రైఫ్రూట్స్‌ లో ఉండే పోషకాలు మన కేశాల పెరుగుదలకు బాగా తోడ్పడుతాయి. వీటిలోని విటమిన్‌ ఈ మన వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచేలా చేస్తుంది. బాదాం, ఖర్జూరపండ్లలో ఉండే ఐరన్‌ శరీరంలో రక్త ప్రసరణ సరిగా ఉండేందుకు తోడ్పడుతుంది. తలకు, కేశాలకు రక్త ప్రసరణ మెరుగుపడి కేశాలు బలంగా తయారవుతాయి.

యాంటీ ఆక్సిడెం‍ట్లు ఎక్కువ
డ్రైఫ్రూట్స్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో కేన్సర్‌ కు కారణమయ్యే పదార్థాలను, ఫ్రీ ర్యాడికల్స్‌ ను అవి తొలగిస్తాయి. అంథోసైనిన్‌ వంటి ఫైటోకెమికల్స్‌ మన మెదడు పనితీరును మెరుగుపర్చి పరిరక్షిస్తాయని, మెదడుకు రక్తం సరిగా సరఫరా అయ్యేలా చూసి.. వృద్ధాప్యంతో వచ్చే సమస్యలను దూరంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

గణనీయ స్థాయిలో ఫైబర్‌ తో..
మన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండాలన్నా, శరీరం విటమిన్లు, ఇతర పోషకాలను సరిగా సంగ్రహించాలన్నా.. ఆహారంలో పీచు పదార్థాలు (ఫైబర్‌) తగిన స్థాయిలో ఉండాల్సిందే. చాలా వరకు డ్రైఫ్రూట్స్‌ లో ఫైబర్‌ గణనీయ స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఉదయమే వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఉదయమే ఆప్రికాట్లు, క్రాన్‌ బెర్రీస్‌, రైజిన్స్‌ వంటివి తీసుకుంటే జీర్ణ వ్యవస్థతోపాటు మొత్తం శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణులు వివరిస్తున్నారు.

ఐరన్‌ ఎక్కువ.. రక్తహీనతకు చెక్‌
శరీరానికి తగినంత ఐరన్‌ అందకుంటే రక్తహీనత, ఎనీమియా వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి డ్రైఫ్రూట్స్‌ తోడ్పడుతాయి. డ్రైఫ్రూట్స్‌ లో ఐరన్‌ శాతం ఎక్కువ. అందువల్ల ముఖ్యంగా మహిళలకు డ్రైఫ్రూట్స్‌ తో లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు రోజూ ఉదయం ఖర్జూరం, ఇతర డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తున్నారు.

చెడు పదార్థాలకు దూరంగా..
సాధారణంగా పొద్దున్నే బ్రేక్‌ ఫాస్ట్‌ గా ఏదైనా ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తీసుకునే అలవాటు ఇటీవలికాలంలో పెరిగింది. అందువల్ల శరీరం బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు రావడం కూడా ఎక్కువైంది. అందువల్ల పొద్దున్నే డ్రైఫ్రూట్స్‌ ను స్నాక్స్‌ గా తీసుకోవడం వల్ల ఇతర పదార్థాలపైకి దృష్టి మళ్లకుండా ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 



More Telugu News