ఆకాశం మీద ఉమ్మేయడమే: నాగబాబుపై బ్రాహ్మణ ఫెడరేషన్ ఫైర్
- దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి వ్యాఖ్యలు
- చిరంజీవిని చూసి అసూయపడటం పరిపాటేనన్న నాగబాబు
- సమాజహితాన్ని మరిచిన చిత్ర వ్యాపారి అన్న బ్రాహ్మణ ఫెడరేషన్
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి వచ్చారు. చిరుతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న వారు పోటీలు పడ్డారు. దీంతో, గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. ఈ క్రమంలో... చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి అన్నారు. వెంటనే చిరంజీవి సెల్ఫీలు దిగడం ఆపేసి వచ్చారు. కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. అయితే, చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్లు వివాదాన్ని రాజేశాయి. ఏపాటి వాడైనా చిరంజీవి ఇమేజ్ ను చూస్తూ ఆ పాటి అసూయపడటం పరిపాటేనని నాగబాబు అన్నారు.
నాగబాబు ట్వీట్ పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. నిత్యం ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆథ్యాత్మికవేత్తను పట్టుకుని... నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన ఒక చిత్ర వ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం వంటిదేనని విమర్శించారు.