నవరాత్రి వేడుకలకు కరెంటు పోతే.. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఊపునిచ్చింది.. వీడియో ఇదిగో

  • ఇటీవల గుజరాత్ లో గర్బా నృత్యం కోసం కొందరి ఏర్పాట్లు
  • సమయానికి కరెంటు పోవడంతో ఓలా స్కూటర్ ను తెచ్చి పెట్టిన తీరు
  • స్కూటర్ లోని బ్లూటూత్ స్పీకర్లకు ఫోన్ ను కనెక్ట్ చేసి పాటలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది. ఎలా అందరిలోనూ నిరుత్సాహం. ఇంతలో ఒకరికి మంచి ఐడియా వచ్చింది. ఇటీవలే కొన్న తన కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అక్కడికి తెచ్చేశారు. ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి స్కూటర్ లోని స్పీకర్ లకు కనెక్ట్ చేసి పాటలు పెట్టారు. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.

అదే స్కూటర్ లో లైట్ కూడా ఆన్ చేసి..
  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో బ్యాటరీ చార్జింగ్ అయి ఉంది. ఇంకేం స్కూటర్ లో లైట్ ను ఆన్ చేసి వెలుతురు పెట్టుకున్నారు. స్పీకర్లలో పాటలు పెట్టుకున్నారు. ఆడా మగా అంతా కలిసి వలయంలా ఏర్పడి తిరుగుతూ గర్భా నృత్యం చేశారు. దీనిని కొందరు వీడియో తీశారు. అయితే కరెంటు పోయి పూర్తి చీకటిగా ఉండటంతో.. ఆ వీడియో కాస్త మసకగా వచ్చింది. శ్రేయాస్‌ సర్దేశాయ్‌ పేరిట ఉన్న ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది. 47 వేలకుపైగా వ్యూస్‌ రాగా.. వందలకొద్దీ లైకులు కూడా వచ్చాయి.
  • ‘‘నవరాత్రి ఉత్సవాల సమయంలో కరెంటు పోతే ఓలా ఎస్‌1 ప్రో ఆదుకుంది. ఓలా స్కూటర్‌ లోని స్పీకర్లు అవసరానికి బాగా పనికొచ్చాయి..’’ అని క్యాప్షన్‌ పెట్టారు.

ఓలా అంటే అన్నింటికీ అంటూ..
  • ‘ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను ఇలా కూడా వాడొచ్చని మాకు తెలియదు’, ‘ఈ ఐడియా ఏదో చాలా బాగుంది..’ అని కొందరు అంటుంటే.. ‘నవరాత్రి ఉత్సవాలకు ఏది అడ్డు వచ్చినా ఆగేదే లేదు. వేడుకలపై వెనక్కి తగ్గేదే లేదు..’ అని అని మరికొందరు పేర్కొంటున్నారు.
  • ‘‘సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే.. దానికి కచ్చితంగా ఓ పరిష్కారం ఉంటుంది. ఇక్కడ వీళ్లు దాన్ని సరిగ్గా గుర్తించి పాటించారు.’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.
  • ‘‘ఓలా అంటే ప్రయాణం మాత్రమే కాదు. ఎంటర్‌ టైన్‌ మెంట్‌. అవసరమైనప్పుడు ఆదుకునే లైఫ్‌ సేవర్‌ కూడా..’’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.


More Telugu News