పోల‌వ‌రంపై ఉమ్మ‌డి స‌ర్వే, బ్యాక్ వాట‌ర్ నియంత్ర‌ణ‌కు ఏపీ అంగీకారం

  • కేంద్ర జ‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం
  • హాజ‌రైన పీపీఏ, ఏపీ, తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్
  • బ్యాక్ వాట‌ర్ ముప్పుపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన తెలంగాణ‌
  • ప్రాజెక్టు స‌ర్వేపై అనుమానం వ్య‌క్తం చేసిన ఒడిశా
  • 19లోగా సాంకేతిక వివ‌రాలు అంద‌జేయాల‌ని ఏపీకి జ‌ల సంఘం ఆదేశం
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యానికి అంగీక‌రించింది. ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రాల‌తో క‌లిసి ఉమ్మ‌డి స‌ర్వే నిర్వ‌హణ‌తో పాటుగా పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టు బ్యాక్ వాట‌ర్ నియంత్ర‌ణ‌కు ఏపీ స‌ర్కారు అంగీక‌రించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర జ‌ల‌సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ కీలక అంశాల‌కు అంగీక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది.

కేంద్ర జ‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో పాటు ఏపీ, తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రాలు హాజ‌ర‌య్యాయి. స‌మావేశంలో భాగంగా పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్‌పై తెలంగాణ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రాజెక్టుపై స‌ర్వే, బ్యాక్ వాట‌ర్ ప్ర‌భావంపై నివేదిక‌ల‌పై ఒడిశా అనుమానం వ్య‌క్తం చేసింది. ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లిగేలా ఈ రెండు అంశాల్లో కేంద్రం నిర్ణ‌యం తీసుకుంద‌ని, ఈ నిర్ణ‌యం వ‌ల్ల పొరుగు రాష్ట్రాలకు క‌లిగే ఇబ్బందిని కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని వాదించింది. 

తెలంగాణ‌, ఒడిశా అభ్యంత‌రాల‌పై స్పందించిన ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టుపై ఉమ్మ‌డి స‌ర్వేకు సిద్ధ‌మేన‌ని తెలిపింది. అంతేకాకుండా బ్యాక్ వాట‌ర్ కార‌ణంగా పొరుగు రాష్ట్రాల్లో జ‌రిగే న‌ష్టాన్ని నివారించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కూడా సిద్ద‌మేన‌ని తెలిపింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాల‌తో ఈ నెల 19లోగా వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని కేంద్ర జ‌ల సంఘం ఏపీకి ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News