నాడు స్కూటర్​ లేని కేసీఆర్​ కు.. విమానం కొనేంత డబ్బులు ఎక్కడివి?: షర్మిల

  • కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ
  • దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశానని వెల్లడించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
  • బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అంతా డ్రామా అని వ్యాఖ్య
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు మాత్రమే అయితే.. కేసీఆర్ సీఎం అయ్యాక లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని విమర్శించారు. చిన్న చిన్న పనుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు దాకా ఒక్క కాంట్రాక్టు సంస్థకే అప్పగించారని.. ఇదంతా అవినీతిలో భాగమేనని వ్యాఖ్యానించారు.

స్కూటర్ లేని కేసీఆర్ కు విమానమా?
ఒకప్పుడు స్కూటర్ కూడా లేని సీఎం కేసీఆర్ కు ఇప్పుడు విమానం కొనుక్కునేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని షర్మిల ప్రశ్నించారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నుంచే వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దేనికీ పనికి రాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే కేంద్ర మంత్రులు దీనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ అవినీతిపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశానని.. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కోరానని షర్మిల తెలిపారు. బీఆర్ఎస్ అంతా డ్రామా అని, దానితో దేశానికి ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News