కొత్త రికార్డులు నమోదు చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్'

  • సెప్టెంబర్ 30న విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్'
  • మణిరత్నం నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ 
  • టాలీవుడ్ లో దక్కని ఆదరణ 
  • కోలీవుడ్ లో కొత్త రికార్డుల నమోదు 
  • ఓవర్సీస్ లోను భారీ వసూళ్ల జోరు
ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రోజులుగా మాట్లాడుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'పొన్నియిన్ సెల్వన్' అనే చెప్పాలి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వచ్చింది. బడ్జెట్ పరంగా మాత్రమే కాదు .. భారీతారాగణం పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది తమిళ ప్రజలకు బాగా తెలిసిన కథ కావడం వలన అక్కడ ఒక రేంజ్ అంచనాల మధ్య విడుదలైంది.

తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదుగానీ, తమిళంలో మాత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తమిళ వెర్షన్ లో 'బాహుబలి' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా అధిగమించింది. ఇక ఇటీవల కాలంలో 'విక్రమ్' సినిమాతో  కమల్ సెట్ చేసిన రికార్డును అధిగమించడానికి కూడా ఎన్నో రోజులు పట్టదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా '2.0' పేరుతో ఉన్న రికార్డును తుడిచేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇలా కోలీవుడ్ లో ఈ సినిమా కొత్త రికార్డులను నెలకొల్పుతూ ముందుకు వెళుతోంది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. తమిళంలో ఈ సినిమాకి జనాలు పడుతున్న నీరాజనాల కారణంగా, త్వరలోనే పార్టు 2 కూడా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి మణిరత్నం ఒక తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టే అనుకోవాలి.


More Telugu News