పర్సు కొట్టేసి .. తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకి.. మొత్తానికి ఇలా దొరికాడు!

  • అమెరికాలోని ఫ్లారిడాలో మహిళ వద్ద పర్సు కొట్టేసిన దొంగ
  • పోలీసులు వెంటపడటంతో తప్పించుకునేందుకు సముద్రంలోకి దూకిన వైనం
  • చివరికి హెలికాప్టర్ ను రంగంలోకి దింపి పట్టుకున్న పోలీసులు
అతనో దొంగ.. దొంగంటే ఎక్స్ దొంగేం కాదు.. ఇప్పటికీ దొంగే. చేసినది కూడా మరీ పెద్ద దోపిడీ ఏమీ కాదు. జస్ట్ ఓ మహిళ వద్ద పర్సు కొట్టేశాడు. పర్సు లాక్కుని అతను పారిపోవడం.. ఆమె అరవడం.. పోలీసులు చూడటం.. వెంటపడటం వరుసగా జరిగిపోయాయి. అతను దొరక్కుండా పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి సముద్రంలోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కానీ పోలీసులు చేసినది చూసి చివరికి లొంగిపోయాడు. ఓ సినిమా సీన్ తరహాలో అమెరికాలోని ఫ్లారిడాలో ఈ సీన్ జరిగింది.

తంపా బే ప్రాంతంలో..
ఫ్లారిడా సముద్ర తీరంలోని తంపా బే ప్రాంతంలో ఈ చోరీ, చేజింగ్ సీన్ జరిగింది. సదరు దొంగ పేరు డవేన్ డీన్. వయసు 32 ఏళ్లు. తంపా బే ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేసి కిందికి దిగిన మహిళ వద్ద పర్సును కొట్టేశాడు. అతను దగ్గరిలోని బీచ్ వైపు పరుగెత్తడం చూసిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. పెట్రోలింగ్ కార్లు, బైకులతో వెతుకుతూ వెంటపడ్డారు. పోలీసులకు దొరకవద్దని భావించిన దొంగ.. వెంటనే సముద్రంలో దూకి దూరంగా ఈదడం మొదలుపెట్టాడు. సుమారు 300 మీటర్ల వరకు లోపలికి వెళ్లాడు.
  • ఇది గమనించిన పోలీసులు బోట్లతో సముద్రంలోకి దిగినా అతను ఎక్కడున్నది కనిపించలేదు. చివరికి హెలికాప్టర్ ను రంగంలోకి దింపారు. హెలికాప్టర్ సముద్ర తీరంలో ఎగురుతూ.. సదరు దొంగ ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది.
  • దొంగ ఉన్న చోటికి హెలికాప్టర్ లో చేరుకున్న పోలీసులు.. ఇక తప్పించుకునే అవకాశమే లేదని, లొంగిపోవాలని స్పష్టం చేశారు. దీనితో రెండు చేతులు పైకి ఎత్తి లొంగిపోతున్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు.
  • ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానిక పోలీసులు రికార్డు చేశారు. దొంగ లొంగిపోతున్న ఫొటోలతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. సదరు దొంగ డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని గుర్తించి ఆ కేసు కూడా నమోదు చేశారు.




More Telugu News