రాజ‌కీయ సెల‌వులోనే ఉన్నా... రాహుల్ గాంధీ యాత్ర‌లో పాల్గొంటా: ర‌ఘువీరారెడ్డి

  • మూడేళ్ల నాడు రాజ‌కీయ సెల‌వు పెట్టాన‌న్న ర‌ఘువీరా
  • ఇప్ప‌టికీ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని వ్యాఖ్య‌
  • ఇటీవ‌లే వైఎస్సార్ వ‌ర్ధంతిలో క‌నిపించిన మాజీ మంత్రి
క్రియాశీల రాజ‌కీయాల‌కు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నీలకంఠాపురం ర‌ఘువీరారెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై శుక్ర‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం తాను రాజ‌కీయ సెలవులో ఉన్నాన‌ని ఆయ‌న అన్నారు. మూడేళ్ల క్రితం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాజ‌కీయ సెల‌వులో ఉన్న‌ప్ప‌టికీ తాను రాహుల్ గాంధీ యాత్ర‌కు హాజ‌ర‌వుతాన‌ని ర‌ఘువీరా చెప్పారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ర‌ఘువీరారెడ్డి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్‌లో కీల‌క మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ ఏపీ అధ్య‌క్షుడిగా కొంత‌కాలం పాటు కొన‌సాగిన ర‌ఘువీరా 2019 ఎన్నిక‌ల త‌ర్వాత అనూహ్యంగా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి క్రియాశీల రాజ‌కీయాల‌ను వ‌దిలేసి త‌న సొంతూరు నీల‌కంఠాపురం చేరారు. రైతుగా మారిపోయిన ఆయ‌న గ్రామంలో ఓ ఆల‌యాన్ని నిర్మించారు. ఇటీవ‌లే జ‌రిగిన వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల్లో క‌నిపించిన ర‌ఘ‌వీరా... రాహుల్ యాత్ర‌లోనూ పాలుపంచుకుంటాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News