కేసీఆర్​ బీఆర్​ఎస్​ కుట్రను త్వరలో బహిర్గతం చేస్తాం: కోదండరామ్​

  • కేసీఆర్‌ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని వ్యాఖ్య
  • ఆయన తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని ఆరోపణ
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరుతో నాటకాలని విమర్శ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని, ఇందులోని డొల్లతనాన్ని ఢిల్లీ స్థాయిలో బయటపెడతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్, ఢిల్లీలలో సదస్సులు పెట్టి బీఆర్ఎస్, కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేస్తామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆ రెండూ కేసీఆర్ కు లేవు..
జవహర్‌ లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌ వంటి వారికి కచ్చితమైన సిద్ధాంతాలు ఉన్నాయని, ఆ దిశగానే ఆర్థిక నమూనాను తయారు చేశారని కోదండరామ్ చెప్పారు. వారి పేర్లను వల్లె వేసే కేసీఆర్‌కు ఆ రెండూ లేవని విమర్శించారు. కేసీఆర్ కేవలం తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని ఆరోపించారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరుతో నాటకాలు ఆడుతున్నారని.. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ఆస్తులు ఎలా పెరిగాయి?
తెలంగాణ అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తున్నట్టు కేసీఆర్ చెప్తూ ఉంటారని.. మరి వారికి ఆస్తులు పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని కోదండరామ్ నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీజేఎస్ పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే.. తాము కూడా మద్దతిస్తామన్నారు.


More Telugu News