చిరంజీవి సహృదయుడు... ఆయనతోనే మాట్లాడతాను: గరికపాటి నరసింహారావు

  • నిన్న హైదరాబాదులో అలయ్ బలయ్
  • హాజరైన చిరంజీవి
  • చిరుతో ఫొటోలకు పోటీలుపడ్డ అభిమానులు
  • గరికపాటి అసహనం
  • మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్న సంగతి తెలిసిందే. 

గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి రావడంతో అభిమానుల కోలాహలం మిన్నంటింది. చిరంజీవితో ఫొటోలకు అక్కడివారు పోటీలుపడ్డారు. దాంతో గరికపాటి అసహనం వ్యక్తం చేస్తూ, చిరంజీవి ఫొటో షూట్ ఆపితేనే తాను ప్రసంగిస్తానని స్పష్టం చేశారు. దాంతో చిరంజీవి వెంటనే వేదికపైకి వచ్చి గరికపాటికి అభివాదం చేసి కార్యక్రమం కొనసాగేలా చూశారు. 

అయితే, చిరంజీవి విషయంలో గరికపాటి వ్యవహరించిన తీరు, మాట్లాడిన విధానం మెగా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్... గరికపాటితో ఫోన్ లో మాట్లాడారు. 

చిరంజీవి పట్ల గరికపాటి వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని, అభిమానుల్లో ఆగ్రహం కలిగినా వారిని తాము శాంతింపజేశామని తెలిపారు. ఎక్కడైనా మెగా అభిమానులు ఇబ్బంది కలిగించారా? అని గరికపాటిని అడిగారు. 

అందుకు గరికపాటి స్పందిస్తూ, ఎవరూ తనను ఇబ్బందిపెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడతానని గరికపాటి వివరణ ఇచ్చారు. ఈ విషయం అందరికీ చెప్పండి... ఇవాళే తప్పకుండా మాట్లాడతాను అని భవానీ రవికుమార్ కు తెలిపారు. ఈ ఫోన్ కాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News