ఔషధ నాణ్యతపై కఠిన విధానాలు అవసరమంటున్న పరిశ్రమ

  • హర్యానా కంపెనీ వ్యవహారంతో భారత ఫార్మాకు చెడ్డపేరు
  • కఠిన నియంత్రణ విధానాలు అవసరమంటున్న పరిశ్రమ
  • చట్టాలు ఉన్నా కానీ అమలు కావడం లేదన్న ఆవేదన
హర్యానా కంపెనీ మెయిడన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందులు సేవించి గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం.. అంతర్జాతీయంగా భారత ఫార్మా పరిశ్రమకు మచ్చగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ ను అప్రమత్తం చేసింది. అసలు మన దగ్గర నాణ్యత పర్యవేక్షణ, పరీక్షలన్నవి సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఈ తరహా నాసిరకం ఔషధాలు వాడి మన దేశంలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. విషపూరితం కావడం, నాణ్యతా ప్రమాణాలు తగినంత లేకపోవడం ఎన్నో సందర్భాల్లో వెలుగు చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కనుక నాణ్యతా నియంత్రణ ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థులపై క్రిమినల్, ఫైనాన్షియల్ లయబిలిటీ వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెయిడన్ ఫార్మాస్యూటికల్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ ఔషధ పరిశ్రమలో గణనీయమైన వాటా కలిగిన భారత్ ఈ తరహా దారుణాలను భరించలేదు’’అని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి పేర్కొన్నారు. నియంత్రణలు చట్టంలో ఉన్నప్పటికీ, అవి అమలు కావడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు లైసెన్స్ లు తీసుకుని నాణ్యత విషయంలో అంతగా పట్టించుకోవడం లేదని నోవార్టిస్ ఇండియా వీసీ, ఎండీ రంజిత్ సహాని పేర్కొన్నారు. 

చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రంలో అనస్థీషియా మందు అయిన ప్రోపోఫోల్ ఇవ్వడం వల్ల ఐదుగురు చనిపోయారు. 2020 ఫిబ్రవరిలో కోల్డ్ బెస్ట్ పీసీ కాఫ్ సిరప్ తాగి జమ్మూకశ్మీర్ కు చెందిన 11 మంది చిన్నారులు మరణించారు. 2018 అక్టోబర్ లో ఘజియాబాద్ కు చెందిన కంపెనీ తయారు చేసిన పోలియో టీకా కలుషితానికి గురైనట్టు బయటపడింది.


More Telugu News