పుతిన్ జోక్ చేయడం లేదు.. కోల్డ్ వార్ తర్వాత మనం మరోసారి అణు యుద్దం ముంగిట ఉన్నాం: బైడెన్

  • క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న బైడెన్
  • ఒక్కసారి అణు యుద్ధం ప్రారంభమైతే ఆగదని వ్యాఖ్య
  • పుతిన్ ఎక్కడ ముగింపు పలుకుతారో అర్థం కావడంలేదన్న యూఎస్ అధ్యక్షుడు
కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం తొలిసారిగా అణు యుద్దం ప్రమాదం ముంగిట నిలిచిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. కెన్నెడీ - క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మనం అలాంటిదాన్ని మళ్లీ ఎదుర్కోలేదని చెప్పారు. న్యూయార్క్ లో తమ డెమొక్రాటిక్ పార్టీ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

1962లో ఈ క్యూబా మిస్సైల్ క్రైసిస్ చోటుచేసుకుంది. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) మధ్య కోల్డ్ వార్ నడిచేది. క్యూబా భూభాగంలో అప్పటి సోవియట్ యూనియన్ మిస్సైళ్లను మోహరించింది. అమెరికాపై దాడి చేసేందుకు క్యూబా అతి దగ్గరి ప్రదేశం కావడంతో సోవియట్ యూనియన్ ఆ పని చేసింది. అప్పట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

ఉక్రెయిన్ ను దారిలోకి తెచ్చేందుకు అవసరమైతే అణ్వాయుధాలను కూడా వాడతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారని... ఈ వ్యాఖ్యలు జోక్ కాదని, ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక అని బైడెన్ అన్నారు. క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం మరింత దిగజారితే... మనందరం అణు యుద్ధం ముంగిట ఉన్నట్టేనని చెప్పారు. 

ఉక్రెయిన్ విషయంలో తమకు ఇక ఏ ఆప్షన్ లేదు అనే పరిస్థితుల్లో అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పుతిన్ హెచ్చరించారు. అయితే... ఈ దాడులు చిన్నగా, వ్యూహాత్మకంగా ఉండొచ్చని యుద్ధ నిపుణులు, విశ్లేషకులు చెపుతున్నారు. అయితే, బైడెన్ మాత్రం ఈ మాటలను తేలికగా తీసుకోవడం లేదు. పుతిన్ గురించి తనకు పూర్తిగా తెలుసని... ఆయన జోక్ చేయడం లేదని అన్నారు. ఒక చిన్న ప్రాంతంపై వ్యూహాత్మకంగా చేసే చిన్న అణు, జీవ, రసాయన ఆయుధాల దాడి... ఆ తర్వాత విస్తృత స్థాయికి చేరుకుంటుందని, దావానలంలా వ్యాపిస్తుందని చెప్పారు. ఒకసారి ఈ తరహా యుద్ధం ప్రారంభమైతే... అది ఆగదని అన్నారు. దీనికి పుతిన్ ఎక్కడ ముగింపు పలుకుతారో అర్థం కావడం లేదని చెప్పారు.


More Telugu News