సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన.. ఖతర్ ప్రపంచకప్ చివరిదన్న అర్జెంటీనా స్టార్
- వచ్చే నెలలో ఖతర్‌లో ప్రపంచకప్
- ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ
- చివరి మ్యాచ్‌కు ముందు ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్టు అంగీకారం
- గత 35 మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగని అర్జెంటీనా
- తాము పేవరెట్లం కాదన్న మెస్సీ
‘‘ప్రపంచకప్‌లో ఏమైనా జరగొచ్చు. మ్యాచ్‌లన్నీ చాలా కఠినంగా ఉంటాయి. ఫేవరెట్లు అయినంత మాత్రాన విజయం సొంతమవుతుందని ఏమీ లేదు’’ అని మెస్సీ పేర్కొన్నాడు. ‘‘మేం ఫేవరెట్లమా? కాదా? అన్న విషయం నాకైతే తెలియదు. అయితే, చరిత్రను చూస్తే మాత్రం అర్జెంటీనా పోటీలో నిలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ అవకాశం మరింత ఎక్కువగా ఉంది. కానీ, మేం ఫేవరెట్లం కాదు. మిగతా జట్లు మా కంటే కొంత పైనున్నాయనే అనుకుంటా’’ అని మెస్సీ వివరించాడు.
అర్జెంటీనా 1978, 1986 ప్రపంచకప్‌లలో విజయం సాధించింది. వచ్చే నెల 22న గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో పోరుతో అర్జెంటీనా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది. తాను శారీరకంగా బాగానే ఉన్నట్టు మెస్సీ చెప్పుకొచ్చాడు.