తొలి వన్డేలో టీమిండియా ఓటమి... సంజు శాంసన్ పోరాటం వృథా

  • లక్నోలో మ్యాచ్
  • 9 పరుగులతో దక్షిణాఫ్రికా విజయం
  • అర్ధసెంచరీలు సాధించిన శాంసన్, శ్రేయాస్ అయ్యర్
  • దెబ్బతీసిన ఓపెనర్ల వైఫల్యం
  • 3 వికెట్లు తీసిన ఎంగిడి
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో... 250 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 8 వికెట్లకు 240 పరుగులు మాత్రమే చేసింది. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ పోరాటం వృథా అయింది. శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆఖర్లో 6 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. స్పిన్నర్ షంసీ ఆ ఓవర్ బౌలింగ్ చేయగా, సంజు శాంసన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదినా ఫలితం దక్కలేదు. టీమిండియా... విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

అంతకుముందు, శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ 33 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), శుభ్ మాన్ గిల్ (3) విఫలం కావడం టీమిండియా ఛేజింగ్ పై ప్రభావం చూపింది. రుతురాజ్ గైక్వాడ్ 19, ఇషాన్ కిషన్ 20 పరుగులు చేశారు.  

దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2, పార్నెల్ 1, కేశవ్ మహరాజ్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో సఫారీలు 1-0తో ఆధిక్యం సంపాదించారు.


More Telugu News