టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా

  • రేపే మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు జారీ కానున్న నోటిఫికేష‌న్‌
  • ఈ నెల 14 దాకా నామినేష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం
  • టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్‌
  • పార్టీ పేరు మార్పును గుర్తించాలంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అందిన ప్ర‌తిపాద‌న‌
  • 14లోగా ఎన్నిక‌ల సంఘం ఆమోదిస్తే బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న టీఆర్ఎస్ అభ్య‌ర్థి
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు రేపు (ఈ నెల 7న‌) నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అంతేకాకుండా రేప‌టి నుంచే నామినేష‌న్ల దాఖ‌లు మొద‌లు కానుంది. ఈ నెల 14 దాకా నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌లో తెలంగాణ‌లో అధికార పార్టీ అభ్య‌ర్థి ఏ పార్టీ పేరిట నామినేష‌న్ దాఖ‌లు చేస్తార‌న్న విష‌యంపై డైల‌మా నెల‌కొంది. 

టీఆర్ఎస్ పార్టీ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా మారుస్తూ సీఎం కేసీఆర్ బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌వాక్య తీర్మానాన్ని ఆమోదించ‌గా...అదే విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినా... పేరు మార్పిడిని గుర్తిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలిపితేనే బీఆర్ఎస్ పేరు వాడ‌క‌లోకి వ‌స్తుంది. అప్ప‌టిదాకా టీఆర్ఎస్ పేరునే గులాబీ నేత‌లు కొన‌సాగించాల్సి ఉంటుంది.

అయితే బుధ‌వారం నాటి టీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం తీర్మానం కాపీని ఆ పార్టీ కీల‌క నేత వినోద్ కుమార్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం గురువారం ఉద‌య‌మే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేసింది. త‌మ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా గుర్తించాలంటూ కేసీఆర్ రాసిన లేఖ‌ను కూడా ఆయ‌న ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేశారు. ఈ అభ్య‌ర్థ‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎప్ప‌టిలోగా ఆమోదిస్తుంద‌న్న‌ది తెలియ‌రాలేదు. 

ఒక వేళ ఈ నెల 14లోగా ఎన్నిక‌ల సంఘం ఈ అభ్య‌ర్థ‌న‌కు ఆమోదం తెలిపితే... మ‌నుగోడు బ‌రిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేస్తారు. ఈ నెల 14 వ‌ర‌కు కూడా ఎన్నిక‌ల సంఘం ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెల‌ప‌కుంటే... పార్టీ పేరు మార్చుకున్నా కూడా టీఆర్ఎస్ అభ్య‌ర్థిగానే అధికార పార్టీ అభ్య‌ర్థి నామినేష‌న్ దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.


More Telugu News