ఆకాశ ఎయిర్ విమానాల్లో పెంపుడు జంతువులకు అనుమతి
- నవంబర్ 1 నుంచి ఫ్లైట్ సర్వీసుల్లో తీసుకెళ్లొచ్చు
- ఈ నెల 15 నుంచి బుకింగ్ లు మొదలు
- సేవలను వేగంగా విస్తరిస్తున్న సంస్థ
పెంపుడు జంతువులతో విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా ఎయిర్ లైన్స్ అనుమతిస్తుండగా.. వీటి సరసన రాకేశ్ ఝున్ ఝున్ వాలా ప్రమోట్ చేసిన విమానయాన సేవల సంస్థ ‘ఆకాశ ఎయిర్’ కూడా నిలవనుంది. ప్రయాణికులు తమ వెంట పెంపుడు జంతువులు తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఆకాశ ఎయిర్ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఇందుకు సంబంధించి బుకింగ్ లను ప్రారంభించనుంది. నవంబర్ 1 నుంచి విమాన సర్వీసుల్లో పెట్స్ ను తీసుకెళ్లేందుకు వీలుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇండిగో, ఎయిర్ ఏషియా సంస్థలు పెట్స్ ను అనుమతించడం లేదు. ఇటీవలే సేవలను ప్రారంభించడంతో ఆకాశ ఎయిర్ ప్రయాణికుల ఆదరణను చూరగొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సంస్థ తన సేవలను కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ఈ నెల 10 నాటికి.. వారానికి విమాన సర్వీసులను 250కు తీసుకెళ్లనుంది.