ఆదిపురుష్ ను మహారాష్ట్రలో ప్రదర్శించనీయం: బీజేపీ నేత హెచ్చరిక
- మరోసారి హిందువుల విశ్వాసాలను గాయపరిచారంటూ అభ్యంతరం
- సీన్లను కత్తిరిస్తే ఒప్పుకోబోమని ప్రకటన
- ఈ తరహా సినిమాలను నిషేధించాలని డిమాండ్
ఆదిపురుష్ సినిమా విషయంలో నెలకొన్న వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. మహారాష్ట్రలో ఈ సినిమాను ప్రదర్శించనీయబోమని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. ‘‘మరోసారి మా దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’అని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
‘‘ఈ విడత క్షమాపణలు చెప్పడమో, సదరు సీన్లను కత్తిరించడమో చేస్తే చాలదు. ఆ విధమైన ఆలోచనలకు గుణపాఠం చెప్పేందుకు వీలుగా, అటువంటి సినిమాలను పూర్తిగా నిషేధించాల్సిందే’’అని రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించగా, ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించారు.
థీమ్, సినిమా చిత్రీకరణను కొందరు మెచ్చుకుంటున్నప్పటికీ.. ఈ సినిమాలో హిందూ దేవతలు, రాక్షసుల పాత్రల తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమా 2023 జనవరి 12న విడుదల కానుంది.