గోరఖ్‌పూర్ జూలో చిరుతపులి పిల్లకి పాలుపట్టిన యోగి ఆదిత్యనాథ్

  • గోరఖ్‌పూర్ జూను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్
  • చిరుత పిల్లను ఒళ్లోకి తీసుకుని పాలుపట్టిన వైనం
  • అనంతరం జూ అంతా కలియదిరిగిన సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న గోరఖ్‌పూర్ జూను సందర్శించారు. స్థానిక ఎంపీ రవికిషన్‌తో కలిసి జూకు వెళ్లిన ఆయన అక్కడో చిరుత పిల్లకు పాలు తాగించారు. ఆయన చుట్టూ పశువైద్యులు ఉండగా పాల సీసాతో పులి పిల్లకు పాలుపట్టారు. చిరుత పిల్ల తొలుత పాలు తాగేందుకు సంశయించింది. చేతులకు రక్షణ కోసం రబ్బరు గ్లోవ్స్ ధరించిన యోగి ఆ తర్వాత దానిని తన ఒళ్లోకి తీసుకుని మళ్లీ పాలు తాగించేందుకు ప్రయత్నించారు. ఈసారి అది పాలను గటగటా తాగేసింది. 

అనంతరం సీఎం జూ అంత కలియదిరిగారు. పులులను ఉంచిన ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా జూ అధికారులు ఆయనతో మాట్లాడుతూ.. ఎన్‌క్లోజర్లకు సంబంధించిన విషయాలు, పులుల నిర్వహణ వంటి వాటిపై వివరించారు. షహీద్ అష్ఫక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌గా పిలిచే గోరఖ్‌పూర్ జూను గతేడాది మార్చిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. పూర్వాంచల్ ప్రాంతంలో ఇదే తొలి జూ పార్క్ కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడోది. పులి పిల్లకు పాలు తాగిస్తున్న సీఎం వీడియోను  ప్రభుత్వం తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసింది.



More Telugu News