నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేసులో ఆల్ట్ న్యూస్ జుబైర్‌, ప్ర‌తీక్‌

  • సోష‌ల్ మీడియా వీడియోల వాస్త‌విక‌త‌ను తెలిపేందుకు ప్రారంభమైన ఆల్ట్ న్యూస్‌
  • మ‌హ్మ‌ద్ జుబైర్‌, ప్ర‌తీక్ సిన్హాల ఆధ్వర్యంలో న‌డుస్తున్న వెబ్ సైట్‌
  • నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేసులో జెలెన్ స్కీ, గ్రెటా థ‌న్‌బ‌ర్గ‌, పోప్ ఫ్రాన్సిస్‌
ప్ర‌తిష్ఠాత్మ‌క నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేసులో భార‌త్‌కు చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు నిలిచారు. సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్ క‌ట్ట‌డే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన ఆల్ట్ న్యూస్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హ్మ‌ద్ జుబైర్‌, ప్ర‌తీక్ సిన్హా ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ బ‌హుమ‌తి రేసులో మొత్తంగా 343 మంది పోటీ ప‌డుతుండగా... వారిలో భార‌త్‌కు చెందిన జుబైర్‌, ప్ర‌తీక్‌ ఉన్న‌ట్లు రాయిట‌ర్స్ వార్తా సంస్థ వెల్ల‌డించింది.

ఇక నోబెల్ శాంతి బ‌హుమ‌తి రేసులో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ, ప‌ర్యావ‌ర‌ణ వేత్త గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ‌, పోప్ ఫ్రాన్సిస్ త‌దిత‌రులున్నారు. మాన‌వాళి ప్ర‌యోజ‌నం కోసం కృషి చేసే వారికి నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు విభాగాల్లో ఈ అవార్డుల‌ను ఇస్తుండ‌గా...రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ ఈ నెల 7న నోబెల్ శాంతి బ‌హుమ‌తిని ప్ర‌క‌టించ‌నుంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ అవుతున్న వీడియోల వాస్త‌విక‌త‌ను వెల్ల‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆల్డ్ న్యూస్‌ను జుబైర్‌, ప్ర‌తీక్‌లు ప్రారంభించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అవుతున్న వీడియోల ఆధారంగానే ఈ వెబ్‌సైట్ వార్త‌ల‌ను ప్ర‌చురిస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం నాటి ఓ ట్వీట్ ఆధారంగా జుబైర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు న్యాయ‌పోరాటం చేసిన జుబైర్ సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి విడుద‌ల‌య్యారు.


More Telugu News