ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత విధానాన్ని అనుసరించాలి: ప్రపంచ బ్యాంకు ప్రశంస

  • కరోనా సమయంలో పేదలను బాగా ఆదుకున్నారని కొనియాడిన ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్
  • పేదలు, లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ బాగుందని ప్రశంస
  • కొవిడ్‌ సమయంలో 69 శాతం పట్టణ, 85 శాతం గ్రామీణ కుటుంబాలకు భారత్ సాయం అందించిందని వెల్లడి
కరోనా మహమ్మారి కొనసాగిన సమయంలో భారత ప్రభుత్వం 69 శాతం పట్టణ, 85 శాతం గ్రామీణ కుటుంబాలకు ఆహారం లేదా నగదు సాయాన్ని అందజేసిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. ఇందుకోసం డిజిటల్‌ వేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. కొవిడ్‌ సంక్షోభం సమయంలో పేదలు, బడుగు వర్గాలకు భారతదేశం అందించిన సాయం విశేషమైనదని ప్రశంసించారు. 

ప్రపంచ దేశాలు ఈ విధానం అనుసరించాలి
వివిధ దేశాల ప్రభుత్వాలు విస్తృతంగా రాయితీలు ఇవ్వడానికి బదులుగా.. భారత్‌ లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అనుసరించాలని మాల్పాస్ చెప్పారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని వివరించారు. కరోనా మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. కానీ ఆ ప్రగతికి కొవిడ్‌-19 ముగింపు పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దేశాలు దీనితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయన్నారు.

నగదు బదిలీతో ప్రయోజనాలన్నో..
దక్షిణాఫ్రికా దాదాపు 2.9 కోట్ల మందికి 6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే భారీ సామాజిక భద్రతా కార్యక్రమాన్ని అమలు చేసిందని మాల్పాస్ గుర్తు చేశారు. బ్రెజిల్‌ లో ఆర్థిక పరిస్థితులు మందగించినప్పటికీ.. 2020లో డిజిటల్‌ నగదు బదిలీ ద్వారా అత్యంత పేదరికాన్ని కొంత తగ్గించగలిగిందని చెప్పారు. విస్తృత స్థాయి రాయితీలకు బదులు ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని తెలిపారు.


More Telugu News