వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి.. నాకు రాజకీయం ఒక టాస్క్: కేసీఆర్

  • దేశంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న కేసీఆర్
  • బంగ్లాదేశ్ కంటే ఇండియా వెనుకబడి ఉండటం ఏమిటని ప్రశ్న
  • దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామని వ్యాఖ్య
దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని చెప్పారు. 

దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని... మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. 

తాను దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు... టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేస్తే ఎలాగని చాలా మంది తనను ప్రశ్నించారని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తొలి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అని తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని... అందుకే అఖిలేశ్ సింగ్ యాదవ్ ను ఈ సమావేశానికి రావద్దని చెప్పామని అన్నారు. త్వరలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలందరూ వస్తారని చెప్పారు. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయని... ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని కేసీఆర్ అన్నారు.


More Telugu News