బీఆర్ఎస్సే కాదు... ఏ పార్టీ వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేవు: ఏపీ మంత్రి జోగి ర‌మేశ్

  • బీఆర్ఎస్ ప్ర‌భావం ఏపీలో ఉండ‌ద‌న్న జోగి ర‌మేశ్
  • కేసీఆర్ ద‌గ్గ‌ర మార్కుల కోసమే తెలంగాణ నేత‌ల విమ‌ర్శ‌లు
  • మ‌రో 20 ఏళ్ల దాకా ఏపీకి సీఎంగా జ‌గ‌నే కొన‌సాగుతార‌న్న మంత్రి
  • వైసీపీ ఏ పార్టీకి భ‌య‌ప‌డ‌బోద‌ని వ్యాఖ్య‌
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి చెందిన కీల‌క నేత‌, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేశ్ స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావ‌మేమీ ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటార‌ని, వారి ఆలోచ‌న‌ల‌ను బ‌ట్టి ఆయా పార్టీల నిర్ణ‌యాలు ఉంటాయ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వైసీపీకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, మ‌రో 20 ఏళ్ల దాకా జ‌గ‌నే ఏపీ సీఎంగా కొన‌సాగుతార‌ని ర‌మేశ్ అన్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ గురించో, ఏపీ గురించో మాట్లాడితే కేసీఆర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయొచ్చని కొంద‌రు తెలంగాణ మంత్రులు భావిస్తున్నార‌ని జోగి ర‌మేశ్ అన్నారు. ఈ కార‌ణంగా తెలంగాణ మంత్రులు ఏపీ గురించి అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటార‌ని అన్నారు. బీఆర్ఎస్సే కాదు ఏ పార్టీ వ‌చ్చినా వైసీపీని ఏమీ చేయ‌లేవ‌న్నారు. వైసీపీ ఎవ‌రికీ భ‌య‌ప‌డే పార్టీ కాద‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ప్ర‌జ‌లంతా త‌మ వైపే ఉన్నార‌న్నారు. వైసీపీ చేప‌ట్టిన‌న్ని సంక్షేమ ప‌థ‌కాలు మ‌రే పార్టీ మ‌రే రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం లేద‌ని ర‌మేశ్ అన్నారు. ఈ కార‌ణంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఏపీలో వైసీపీనే విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News