ఆ పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనం అవుతున్నాయా?

  • త‌మిళ‌నాడుకు చెందిన‌ వీసీకే పార్టీ నేడే విలీనం అవుతుంద‌ని వార్త‌లు
  • ద‌క్షిణాదిలో మూడు, నాలుగు పార్టీలు ముందుకొచ్చే అవ‌కాశం
  • నేడు బీఆర్ఎస్ పై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేసీఆర్‌
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు కొత్త జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. కొత్త పార్టీకి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అనే పేరు ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. దేశ రాజ‌కీయాల్లో మార్పు తెచ్చేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌కు ద‌క్షిణాది నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. బీఆర్ఎస్‌లో ప‌లు పార్టీలు విలీనం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ జాబితాలో త‌మిళ‌నాడుకు చెందిన విదుతాలై చిరుతైగ‌ల్ క‌చ్చె(వీసీకే) పార్టీ ముందు ఉంద‌ని వార్త‌లు వస్తున్నాయి. వీసేకే  వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంపీ తిరుమాళవన్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇప్ప‌టికే హైద‌రాబాద్ వ‌చ్చి కేసీఆర్‌తో స‌మావేశం అయ్యారు. 

ఈ క్ర‌మంలో తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వీసీకే.. బీఆర్ఎస్‌లో విలీన ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఈ స‌మావేశానికి  ఆహ్వానించారు. దీనితోపాటు కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా నూత‌న జాతీయ పార్టీలో విలీనం అవుతాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, ఈ విష‌యంలో స‌ద‌రు పార్టీల నుంచి ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మున్ముందు దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కార్యక్రమానికి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు పలు రాష్ట్రాల నేత‌లు హైద‌రాబాద్ వ‌చ్చారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమార‌స్వామి, మాజీ మంత్రి రేవణ్ణ, పలువురు ఎమ్మెల్యేలు, తిరుమాళవన్, త‌మిళ‌నాడుకు చెందిన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మావేశంలో పాల్గొంటారు.


More Telugu News