ప్ర‌ధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పిన జెలెన్‌స్కీ

  • నిన్న జెలెన్ స్కీకి ఫోన్ చేసిన మోదీ
  • యుద్ధాన్ని వీడి చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచ‌న‌
  • త‌మ దేశాన్ని సంద‌ర్శించాల‌ని మోదీని కోరిన జెలెన్‌స్కీ
భార‌త ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ యొక్క 'సమగ్రత'కి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీ మంగ‌ళ‌వారం జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్ర‌స్తుత కాలం యుద్ధ స‌మ‌యం కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రెండు దేశాలు యుద్ధాన్ని విర‌మించుకోవాల‌ని సూచించారు. ఇరు దేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ను చ‌ర్చ‌లు, దౌత్యం ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. అలాగే, ఇరు దేశాల మ‌ధ్య శాంతి ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. 

ఈ విష‌యంలో భార‌త్ ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని చెప్పారు. ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాల‌ను తమ అధీనంలోకి తీసుకున్న‌ట్టు ర‌ష్యా అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ.. జెలెన్‌స్కీతో మాట్లాడ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు ఫోన్ చేసిన మోదీకి ధ‌న్యవాదాలు చెబుతూ జెలెన్‌స్కీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది యుద్ధ కాలం కాద‌న్న‌ ప్రధాని మోదీ సందేశం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. త‌మ దేశాన్ని సంద‌ర్శించాల‌ని మోదీని కోరారు.


More Telugu News