సరదాగా ట్రెక్కింగ్ కు వెళితే ప్రపంచంలో అరుదైన పుష్పం దొరికింది.. వీడియో ఇదిగో
- ఇండోనేషియాలో రఫ్లీషియా అర్నోల్డిని గుర్తించిన యువకుడు
- ఒకే పువ్వుగా ఉండే వాటిలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం
- పురుగులను ఆకర్షించేందుకు కుళ్లిన మాంసం వంటి వాసన
- ఇతర పెద్ద పుష్పాలు ఉన్నా.. అవి కొన్నిపూలు కలిసి ఏర్పడిన నిర్మాణాలు అంటున్న శాస్త్రవేత్తలు
అది ఇండోనేషియాలోని అటవీ ప్రాంతం.. ఓ యువకుడు సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లాడు.. కొండలు, గుట్టల మధ్య అడవిలో వెళుతున్న అతడికి నేలపై ముదురు ఎరుపు రంగులో పెద్ద ఆకారం కనబడింది. దగ్గరికి వెళ్లి చూస్తే అదో పుష్పం.. అది మామూలు పుష్పం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏక పుష్పమైన రఫ్లీషియా అర్నోల్డి. ఆ పువ్వును చూసి ఆశ్చర్యపోయిన యువకుడు దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. మొదట ఏదో అలంకరణ కోసం వాడే ప్లాస్టిక్ పువ్వు అనుకున్నానని.. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది అతిపెద్ద పుష్పమని గుర్తించానని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు.
ఏమిటీ రఫ్లీషియా అర్నోల్డి..
భూమ్మీద అత్యంత పురాతన జాతులకు చెందిన భారీ పుష్పాల్లో రఫ్లీషియా అర్నోల్డి ఒకటి. చూడటానికి మాంసం రంగులో ఉండి, కుళ్లిన మాంసం వంటి వాసన వెదజల్లుతుంది. క్రిమికీటకాలను ఆకర్షించడం కోసమే ఇది ఈ రంగులో, వాసనతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రంగు, వాసన వల్లే దీనికి శవం పువ్వు (కార్ప్స్ ఫ్లవర్) అని కూడా పిలుస్తుంటారు.
ఏమిటీ రఫ్లీషియా అర్నోల్డి..
భూమ్మీద అత్యంత పురాతన జాతులకు చెందిన భారీ పుష్పాల్లో రఫ్లీషియా అర్నోల్డి ఒకటి. చూడటానికి మాంసం రంగులో ఉండి, కుళ్లిన మాంసం వంటి వాసన వెదజల్లుతుంది. క్రిమికీటకాలను ఆకర్షించడం కోసమే ఇది ఈ రంగులో, వాసనతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రంగు, వాసన వల్లే దీనికి శవం పువ్వు (కార్ప్స్ ఫ్లవర్) అని కూడా పిలుస్తుంటారు.
- భూమ్మీద ఈ పుష్పం కన్నా పెద్ద పూలు (అమోర్ఫోఫాల్లస్, టైటాన్ ఆరమ్ వంటివి) ఉన్నాయని.. కానీ అవి ఒకే పుష్పం కాకుండా.. కొన్ని పుష్పాలు కలిసి ఏర్పడిన నిర్మాణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- కేవలం ఒకే పువ్వుగా చూస్తే రఫ్లీషియా అర్నోల్డి ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం అని స్పష్టం చేస్తున్నారు.
- ఇవి చాలా ఏళ్లకోసారి మాత్రమే పుష్పిస్తాయని, అందువల్ల కనబడటం చాలా అరుదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- అది కూడా కేవలం ఒక రోజు మాత్రమే పూర్తి పుష్పంలా ఉంటాయని.. తర్వాతి రోజు నుంచి ముడుచుకుంటూ కుళ్లిన మాంసం వాసనను విపరీతంగా వెదజల్లుతాయని వివరిస్తున్నారు.