ఈ జైలుకు వెళ్లాలంటే నేరం చేయనక్కర్లేదు... రూ.500 చెల్లిస్తే చాలు!

  • ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జైలు టూరిజం
  • జైల్లో గడిపేందుకు రుసుం
  • టూరిస్టులకు ఖైదీ యూనిఫాం, జైలు ఫుడ్
రిమాండ్ ఎదుర్కొనే నిందితులు, కోర్టులో శిక్ష పడిన దోషులు జైలుకు వెళతారన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ లోని ఈ జైలుకు ఏ నేరం చేయకపోయినా వెళ్లొచ్చు. అంతేకాదు, ఆ జైలులో ఒకరాత్రి గడపొచ్చు. అందుకు రూ.500 చెల్లిస్తే చాలు... ఆ జైలు అధికారులే తగిన ఏర్పాట్లు చేస్తారు. 

ఈ జైలు హల్ద్వానీలో ఉంది. అనేక నేరాలకు పాల్పడినవారు ఇక్కడ ఖైదీలుగా ఉన్నారు. హల్ద్వానీ పట్టణానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వారిని ఆకట్టుకుని, నిజమైన జైల్లో ఎలా ఉంటుందో వారికి అనుభూతిని అందించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. 

హల్ద్వానీ జైలు చాలా పురాతనమైనది. బ్రిటీష్ హయాంలో 1903లో కారాగారాన్ని నిర్మించారు. ఇందులో సిబ్బందికి కొన్ని క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడవి వాడకంలో లేవు. జైల్లో గడపాలనుకునే పర్యాటకుల కోసం ఇప్పుడీ క్వార్టర్స్ ను ముస్తాబు చేస్తున్నారు. 

జైల్లో గడిపేందుకు వచ్చే పర్యాటకులకు వసతి ఏర్పాటు చేయడమే కాదు, జైలు ఖైదీలకు ఇచ్చే యూనిఫాం ఇస్తారు. ఖైదీలకు అందించే భోజనమే వారికీ అందిస్తారు. 

అంతేకాదు, ఈ జైలు పర్యాటకం వెనుక మరో కారణం కూడా ఉంది. 'బంధన యోగం' నుంచి బయటపడాలంటే కొన్నాళ్లు నిర్బంధంలో గడపాలని జ్యోతిష్కులు చెబుతుంటారని, అలాంటివాళ్లు కూడా జైలులో గడిపేందుకు ఈ పథకం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.


More Telugu News