గాడిదకేం తెలుసు గంధపుచెక్క వాసన... అందుకే నేడు గాన గంధర్వుడిని అవమానించారు: చంద్రబాబు

  • గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు
  • ఇవాళ మరుగుదొడ్డి వద్ద దర్శనమిచ్చిన విగ్రహం
  • తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
  • మనసు చివుక్కుమందని వెల్లడి
గుంటూరులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారులు తొలగించడం తెలిసిందే. అయితే, అత్యంత దారుణ రీతిలో ఎస్పీ బాలు విగ్రహం నేడు ఓ మరుగుదొడ్డి వద్ద దర్శనమిచ్చింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కరడుగట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"గాడిదకేం తెలుసు గంధపుచెక్క వాసన అని ఓ సామెత ఉంది. అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడ్ని అవమానించారు, ఇవాళ గాన గంధర్వుడిని అవమానించారు. ఎస్పీ బాలు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటిది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం, ఇంకా ఘోరంగా, తొలగించిన ఆ విగ్రహాన్ని మరుగుదొడ్డి వద్ద పెట్టడం తెలుగుజాతికే అవమానకరం" అని చంద్రబాబు మండిపడ్డారు. 

ఎస్పీ బాలు విగ్రహం పరిస్థితి తెలిసి మనసు చివుక్కుమందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలును అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఎస్పీ బాలు విగ్రహం గుంటూరులో ఓ మరుగుదొడ్డి వద్ద ఉన్న ఫొటోను కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.


More Telugu News