బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • ఏపీ తీరానికి చేరువగా రానున్న అల్పపీడనం
  • కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్న వాతావరణ కేంద్రం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, ఇది బుధవారం నాటికి ఏపీ తీరానికి చేరువగా రావొచ్చని తెలిపింది.

కోస్తాంధ్రలో పలు చోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు మూడ్రోజుల పాటు చేపల వేటకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.


More Telugu News