భ‌విష్యత్తులో జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇస్తానేమో: మెగాస్టార్ చిరంజీవి

  • గాడ్ ఫాద‌ర్ మీడియా మీట్‌లో ప‌వ‌న్ పార్టీపై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
  • తన త‌మ్ముడి నిబ‌ద్ధ‌త, నిజాయ‌తీ తనకు తెలుసున‌న్న చిరు
  • ప‌వ‌న్ లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడు రావాల‌నేదే త‌న ఆకాంక్ష అని వ్యాఖ్య‌
  • భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ ఏ ప‌క్షాన ఉంటాడ‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని వెల్ల‌డి
ఏపీ రాజ‌కీయాలు... ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు... ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏ త‌ర‌హా నాయ‌క‌త్వం రావాల‌న్న అంశాల‌పై టాలీవుడ్ మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్‌కు సంబంధించి మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్తులో తాను మ‌ద్ద‌తు ఇస్తానేమోనంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిత్వాన్ని చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. ప‌వ‌న్‌ను త‌న సోద‌రుడిగా ప‌దే ప‌దే పేర్కొన్న చిరు... ప‌వ‌న్ నిబ‌ద్ధ‌త‌, నిజాయ‌తీ క‌లిగిన నేత అని అన్నారు. త‌న నిబద్ధ‌త నుంచి ప‌వ‌న్ ఏమాత్రం ప‌క్క‌కు త‌ప్పుకోలేద‌ని కూడా చిరు చెప్పారు. చిన్న‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ త‌న మ‌న‌స్త‌త్వాన్ని ఏమాత్రం మార్చుకోలేద‌ని చెప్పిన చిరు... ఆ ల‌క్ష‌ణ‌మే ప‌వ‌న్‌లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మ‌ని చెప్పారు. ప‌వ‌న్ లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడు మ‌న‌కు రావాలంటూ చిరు వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కుడు రావాల‌నేదే త‌న ఆకాంక్ష‌గా చెప్పిన చిరంజీవి... అందుకోసం త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ ఏ ప‌క్షాన ఉంటాడ‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని ఆయ‌న చెప్పారు. ప‌వ‌న్‌కు రాష్ట్రాన్ని ఏలే అవ‌కాశం ప్ర‌జ‌లు ఇచ్చే రోజు రావాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో భవిష్య‌త్తులో ప‌వ‌న్‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తానేమోన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. తామిద్ద‌రం చెరోవైపు ఉండ‌టం కంటే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే ప‌వ‌న్‌కు హెల్ప్ అవుతుందేమోన‌ని భావించాన‌ని చిరంజీవి అన్నారు.


More Telugu News