వైద్య రంగంలో స్వీడిష్ పరిశోధకుడు స్వాంటే పాబోను వరించిన నోబెల్ ప్రైజ్

  • ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన
  • మానవ పరిణామంపై స్వాంటే పాబో పరిశోధనలు
  • పాబో ఆవిష్కరణలకు విశిష్ట గుర్తింపు
వైద్యరంగంలో 2022 సంవత్సరానికి గాను స్వీడిష్ పరిశోధకుడు స్వాంటే పాబోను ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ వరించింది. అంతరించిపోయిన ఆదిమానవుల జన్యుక్రమం, మానవ పరిణామం అంశాల్లో  నూతన ఆవిష్కరణలకు గాను ఈ విశిష్ట పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్ మాన్ ఈ మేరకు విజేతను ప్రకటించారు.

రాతియుగం నాటి నియాండర్తల్ మానవుడు నేటి ఆధునిక మానవుడికి బంధువు అనదగ్గవాడు. ఈ కోణంలో నియాండర్తల్ మానవుడి జన్యుక్రమాన్ని స్వాంటే పాబో ఆవిష్కరించారు. అంతేకాదు, ఇప్పటివరకు వెలుగుచూడని డెనిసోవా మానవుడి గుట్టుమట్లను కూడా సంచలనాత్మక రీతిలో ఆవిష్కరించారు. అంతరించిపోయిన మానవుల జన్యువులు ఇప్పటి ఆధునిక హోమోసేపియన్స్ కు బదిలీ అయిన తీరును వివరించారు. అనేక ఇన్ఫెక్షన్లకు ఇప్పటి మానవుల వ్యాధినిరోధక వ్యవస్థ స్పందించే తీరుకు, జన్యు బదిలీకి మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని విపులంగా తెలిపారు.

కాగా, ఇతర రంగాల్లోనూ నోబెల్ విజేతలను రోజుకొకరి చొప్పున ప్రకటించనున్నారు. రేపు (అక్టోబరు 4) భౌతికశాస్త్ర విజేతను, అక్టోబరు 5న రసాయనశాస్త్ర విజేతను, అక్టోబరు 6న సాహిత్యంలో నోబెల్ విజేతను, అక్టోబరు 7న నోబెల్ శాంతి బహుమతి విజేతను, అక్టోబరు 10న ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేత పేరును వెల్లడించనున్నారు.


More Telugu News