నీ వయసెంత? నువ్వు మాట్లాడే మాటలేంటి?: అయ్యన్నపై మంత్రి ముత్యాలనాయుడు ఆగ్రహం

  • అయ్యన్న కుమారుడు విజయ్ కి సీఐడీ నోటీసులు
  • ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన అయ్యన్న
  • స్పందించిన మంత్రి ముత్యాలనాయుడు
  • అయ్యన్న మాటలు సీనియారిటీకి తగినవి కావని విమర్శలు
ఏపీ సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతిపై దుష్ప్రచారం ఐటీడీపీ పనే అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. ఈ కేసులో ఏపీ సీఐడీ నోటీసులు ఇస్తే ఉలికిపాటు ఎందుకని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ప్రశ్నించారు. 

ఈ వ్యవహారంలో అయ్యన్న మాటలు ఆయన సీనియారిటీకి తగినవి కావని అన్నారు. రాజకీయంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే మందలించాల్సింది పోయి, అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నీ వయసెంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? అని ప్రశ్నించారు. అయ్యన్న తీరు సైకోలా ఉందన్నారు.

"నోటీసులు వచ్చిన తర్వాత మీ కుమారుడికి మీరు ఫోన్ చేసి విచారణకు హాజరవమని చెప్పాలి. మీ వల్ల తప్పేమీ లేదనుకుంటే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? మీ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకురమ్మన్నారు... మీరు ఎలాంటి తప్పు చేయలేదనుకుంటే వాటిని తీసుకెళ్లి అక్కడ పెట్టండి. మీరే కాదు, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం విచారణకు హాజరయ్యారు" అని ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. 

ఇటీవల అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై అయ్యన్న తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పైవిధంగా స్పందించారు.


More Telugu News