సినిమా సీన్‌ను త‌ల‌పించే ఎన్‌కౌంట‌ర్‌లో కిడ్నాప‌ర్ల చెర నుంచి 11 ఏళ్ల బాలుడిని ర‌క్షించిన పోలీసులు

  • గ్రేట‌ర్ నోయిడాలో సోమ‌వారం జ‌రిగిన‌ ఘ‌ట‌న‌
  • ఆదివారం ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసిన న‌లుగురు దుండ‌గులు
  • 10 గంటల్లోనే కేసును ఛేదించిన గ్రేట‌ర్ నోయిడా పోలీసులు
  • కాల్పుల్లో ఇద్ద‌రు నిందితుల‌కు గాయాలు.. మ‌రో ఇద్ద‌రు కిడ్నాప‌ర్లు ప‌రార్
అచ్చం సినిమా సీన్‌ను త‌ల‌పించేలా కిడ్నాప‌ర్లతో ఎన్‌కౌంట‌ర్ జ‌రిపిన పోలీసులు వారి చెర నుంచి 11 ఏళ్ల బాలుడుని పోలీసులు విడిపించి సుర‌క్షితంగా వాళ్ల కుటుంబ స‌భ్యులుకు అప్ప‌గించారు. గ్రేటర్ నోయిడా ప‌రిధిలో సోమ‌వారం  ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. చాలా వేగంగా, స‌మ‌య‌స్ఫూర్తితో స్పందించిన గ్రేట‌ర్ నోయిడా పోలీసులు ఆ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. త‌ప్పిపోయిన ప‌ది గంట్లోనే బాలుడిని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించి ప్ర‌శంస‌లు అందుకున్నారు.
 
ఆదివారం త‌న కుమారుడిని కొంద‌రు దుండ‌గులు కిడ్నాప్ చేశార‌ని ఓ వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. విడిచిపెట్టాలంటే రూ. 30 ల‌క్ష‌లు డిమాండ్ చేశార‌ని తెలిపాడు. ఫిర్యాదు అందుకున్న వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గాలింపు చేప‌ట్టారు. న‌లుగురు దుండ‌గుల వ‌ద్ద బాలుడు ఉన్నాడ‌ని గుర్తించారు. 

పోలీసులు వారి ద‌గ్గ‌ర‌కు చేరుకోగానే..కిడ్నాప‌ర్లు కాల్పులు జ‌రిపారు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు నిందితుల‌కు బుల్లెట్లు గాయాల‌య్యాయి. వారిని అందుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని సుర‌క్షితంగా ఇంటికి చేరారు. పారిపోయిన మ‌రో ఇద్ద‌రు కిడ్నాప‌ర్ల కోసం గాలిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని గ్రేటర్ నోయిడా డీసీపీ అభిషేక్ వర్మ  తెలిపారు. విజయవంతమైన ఆపరేషన్ అనంతరం బాలుడిని సుర‌క్షితంగా తల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన‌ట్లు చెప్పారు. పారిపోయిన  ఇద్ద‌రు కిడ్నాప‌ర్ల‌ను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాగా, ఈ ఆప‌రేష‌న్ లో పాల్గొన్న‌ బృందానికి రూ.25,000 నగదు బహుమతిని అందించామని డీసీపీ అభిషేక్ వర్మ తెలిపారు.


More Telugu News