మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ సైకిల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. సేవ్ ఏపీ పోలీస్ అంటూ నినాదాలు

  • తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరిన ప్రకాశ్
  • వివిధ కారణాలతో ఇప్పటి వరకు 358 మంది పోలీసులను విధుల నుంచి తప్పించారని ఆవేదన
  • ఏపీ పోలీసులను రక్షించాలని, టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్
  • సైకిల్ యాత్రకు అనుమతి లేకపోవడం వల్లే అడ్డుకున్నామన్న పోలీసులు
తనకు న్యాయం చేయాలని, ఉద్యోగంలోకి మళ్లీ తీసుకోవడంతోపాటు గ్రాంట్స్, ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్, టీఏ, డీఏలు ఇవ్వాలని, ఏపీ పోలీసులను రక్షించాలని, సామాజిక న్యాయం చేయాలన్న ప్లకార్డుతో సైకిల్ యాత్రకు సిద్ధమైన మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు అడుకుని అరెస్ట్ చేశారు. నిన్న అనంతపురం ప్రెస్‌క్లబ్ నుంచి ఆయన సైకిల్ యాత్రకు సిద్ధమవుతుండగా వచ్చిన పోలీసులు ప్రకాశ్‌ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

ఈ సందర్బంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపించారు. వారికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, టీఏ, డీఏ,ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ బకాయిలు చెల్లించకపోవడంతో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు 358 మంది పోలీసులను ప్రభుత్వం విధులనుంచి తప్పించిందన్నారు. బకాయిలు చెల్లించాలని అడిగినందుకే తనను విధుల నుంచి తప్పించారని ఆరోపించారు. సామాజిక న్యాయం చేయాలని కోరారు. కాగా, ప్రకాశ్ యాత్రకు అనుమతి లేకపోవడం వల్లే ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News