మూగబోయిన ఆర్బిటర్... ముగిసిన భారత్ మార్స్ మిషన్ 'మామ్'

  • 2013లో మామ్ మిషన్ చేపట్టిన ఇస్రో
  • అంగారక కక్ష్యలోకి ఆర్బిటర్
  • ఎంతో విలువైన డేటా అందించిన మామ్
  • ఇటీవల చివరి సందేశం పంపిన ఆర్బిటర్
అంగారకుడిపై పరిశోధన నిమిత్తం భారత్ ఎనిమిదేళ్ల కిందట చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మామ్' (ఎంవోఎం) ముగిసింది. 2013 నవంబరు 5న రోదసిలోకి పంపిన మామ్ స్పేస్ క్రాఫ్ట్ మూగబోయింది. ఇటీవలే తన చివరి సందేశాన్ని గ్రౌండ్ స్టేషన్ కు పంపింది. 

వాస్తవానికి ఈ ఆర్బిటర్ ను 6 నెలలు పనిచేసేలా డిజైన్ చేశారు. అయితే ఇది ఎనిమిదేళ్లుగా పనిచేస్తూనే ఉంది. ఇటీవలే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. 

ఇంధనం అయిపోవడం, బ్యాటరీ శక్తి తరిగిపోవడం వంటి కారణాలతో ఈ ఆర్బిటర్ పనితీరు నిలిచిపోయిందా? అనే కోణంలో ఇస్రో కారణాలు అన్వేషిస్తోంది. అంగారకుడి ఉపరితలంపై సుదీర్ఘకాలం పాటు సంభవించిన భారీ గ్రహణం వల్ల ఇది శక్తిని సమకూర్చుకోలేకపోయిందన్న కోణంలోనూ ఇస్రో విశ్లేషిస్తోంది. సాధారణంగా గ్రహణం సమయంలో దీని యాంటెన్నాను మరో దిశకు మళ్లించే యాంత్రిక విన్యాసం విఫలమైనందువల్లే ఇది పనిచేయడం ఆగిపోయి ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

కాగా, ఇక ఈ స్పేస్ క్రాఫ్టును తిరిగి భూమికి తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్ సీ)కు చెందిన ఓ శాస్త్రవేత్త తెలిపారు. 

మరో సీనియర్ శాస్త్రవేత్త స్పందిస్తూ... "ఈ ఏడాది ఏప్రిల్ లో అంగారకుడిపై సుదీర్ఘ సమయంపాటు గ్రహణం ఏర్పడింది. గ్రహణం నుంచి వెలుపలికి వచ్చేందుకు స్పేస్ క్రాఫ్టులో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి గ్రహణాల నుంచి ఇది విజయవంతంగా వెలుపలికి వచ్చింది. అయితే ఈసారి గ్రహణం నుంచి తప్పించుకునే క్రమంలో ఇంధనం అయిపోయి ఉండొచ్చు. లేకపోతే, రోల్ స్పిన్ కమాండ్ కారణంగా భూమికి అభిముఖంగా ఉండాల్సిన యాంటెన్నా దిశ మారిపోయి ఉండాలి" అని వివరించారు. 

భారత్ చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ బడ్జెట్ రూ.450 కోట్లు. ఈ ఆర్బిటర్ బరువు 1.35 టన్నులు. ఈ ఆర్బిటర్ ను పీఎస్ఎల్వీ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన మామ్... ఇప్పటిదాకా ఎంతో విలువైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. మామ్ సేకరించిన డేటాను ప్రపంచవ్యాప్తంగా అనేక అంతరిక్ష పరిశోధన సంస్థలు తమ విశ్లేషణల కోసం ఉపయోగించుకోవడం విశేషం.


More Telugu News