దేశంలో గాంధీజీనే అవమానిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి: సీఎం కేసీఆర్​

  • వెకిలి వ్యక్తులు చేసే హేళనలతో మహాత్ముడి గొప్పదనం తగ్గదని వ్యాఖ్య
  • గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయమన్న సీఎం
  • ప్రపంచ నాయకులు కూడా గాంధీని ఆదర్శంగా తీసుకున్నారని గుర్తు చేసిన కేసీఆర్
దేశంలో గాంధీజీనే అవమానించే పరిస్థితులను చూస్తున్నామని, దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. వెకిలి వ్యక్తులు చేసే హేళనల వల్ల మహాత్మా గాంధీ గొప్పతనం తగ్గబోదని వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయమన్నారు. 

గాంధీజీని గుర్తు చేసుకునేవాడిని..
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బక్కపల్చని వాడు ఏం చేస్తారని తనను చాలా మంది అవహేళన చేశారని.. అప్పుడు తాను గాంధీజీని గుర్తు చేసుకునేవాడినని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశం బాగుంటే అందరం బాగుంటామని.. శాంతి లేకపోతే జీవితం చాలా బాధగా ఉంటుందని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనదని.. కుల, మత, వర్గ రహితంగా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్యం వైపు నడిపారని గుర్తు చేసుకున్నారు. గాంధీ చెప్పిన ప్రతి మాటా.. వేసిన ప్రతి అడుగూ ఆచరణీయమని చెప్పారు.

ఎందరికో ఆయన ఆదర్శం
మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి గొప్పవాళ్లు కూడా మహాత్ముడి మార్గాన్ని అనుసరించారని కేసీఆర్ గుర్తు చేశారు. దలైలామా కూడా తనకు గాంధీ ఆదర్శమని చెప్పారని.. గాంధీజీ ఈ భూమిపై పుట్టకపోయి ఉంటే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యే వాడిని కాదని బరాక్‌ ఒబామా పేర్కొన్నారని వివరించారు.



More Telugu News