మోషన్ కు ఎన్నిసార్లు వెళుతున్నారు..? మీకున్న రిస్క్ ఏంటి?

  • ఒకటికంటే ఎక్కువ సార్లు వెళితే పలు వ్యాధుల రిస్క్
  • గుండె జబ్బులు, సీవోపీడీ మూత్ర పిండాల సమస్యలు
  • చైనా పరిశోధనలో వెల్లడి
రోజులో ఎన్ని సార్లు మల విసర్జన (మోషన్) చేస్తున్నారు..? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల రిస్క్ ను తెలియజేస్తుందని అంటున్నారు చైనీస్ పరిశోధకులు. చైనా శాస్త్రవేత్తలు చేసిన సుదీర్ఘకాల పరిశోధన ఫలితాలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. 

చైనా కడూరీ బయోబ్యాంక్ డేటాను తీసుకున్న పరిశోధకులు.. 4,87,198 మందిని వాలంటీర్లుగా తీసుకున్నారు. వీరి వయసు 30-79 ఏళ్ల మధ్య ఉంది. ముందస్తు వ్యాధులు ఉన్నట్టు చెప్పిన వారిని పరిశోధన సర్వే నుంచి మినహాయించారు. ఎంత తరచుగా మోషన్ కు వెళ్లాల్సి వస్తోంది? అని మిగిలిన వారిని ప్రశ్నించారు. రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు, రోజులో ఒక్కసారి, రెండు మూడు రోజులకు ఒకసారి, వారంలో మూడు సార్ల కంటే తక్కువ వెళుతున్నట్టు స్పందనలు వచ్చాయి. 

రోజులో ఒక్కసారే వెళ్లేవారితో పోలిస్తే ఎక్కువ సార్లు మోషన్ కు వెళుతున్న వారిలో ఇస్మిక్ హార్ట్ డిసీజెస్, గుండె వైఫల్యం, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్, టైప్ -2 మధుమేహం, తీవ్ర మూత్ర పిండాల సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు తెలిసింది. వారంలో మూడు సార్లకంటే తక్కువ మోషన్ కు వెళుతున్న వారిలోనూ ఇస్మిక్ హార్ట్ డిసీజ్ రిస్క్ అధికంగా ఉందని తెలిసింది. కనుక రోజులో ఒకటికంటే ఎక్కువ పర్యాయాలు మలవిసర్జన చేస్తున్నట్టు అయితే, వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నది పరిశోధన సారాంశం.


More Telugu News