వచ్చే ఆరు నెలల్లో 200 పట్టణాల్లో 5జీ సేవలు.. వచ్చే ఆగస్టు నాటికి బీఎస్ఎన్ఎల్ సైతం: టెలికం మంత్రి వైష్ణవ్

  • 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని ప్రకటన
  • వచ్చే ఆగస్ట్ 15 నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
  • 5జీ సేవలు కూడా అందుబాటులోనే ఉండాలన్న ఆకాంక్ష
200 పట్టణాల్లో 5జీ సేవలు 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ సైతం వచ్చే ఆగస్ట్ 15 నుంచి 5జీ సేవలను అందిస్తుందని చెప్పారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సైతం 5జీ రేసులోకి అడుగుపెట్టనుందని ఖాయమైపోయింది. 5జీ ప్లాన్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరింత చౌకగా అందిస్తుందేమో చూడాలి.

వచ్చే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 80-90 ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అశ్వని వైష్ణవ్ చెప్పారు. 5జీ సేవలు కూడా అందుబాటు ధరల్లోనే ఉండాలన్నారు. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ రెండింటి నుంచి ముందుగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంతవరకు 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో 5జీ సేవలపై మంత్రి ప్రకటన చేయడం గమనించాలి.


More Telugu News