నెత్తురోడిన కాన్పూర్.. రెండు గంటల్లో రెండు ప్రమాదాలు: 31 మంది దుర్మరణం

  • చంద్రిక దేవి ఆలయాన్ని దర్శించుకుని వస్తుండగా చెరువలో పడిన ట్రాక్టర్ ట్రాలీ
  • 26 మంది మృతి.. 20 మందికి గాయాలు
  • మరో ఘటనలో ఐదుగురి దుర్మరణం
  • బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
  • ప్రయాణాలకు ట్రాక్టర్ ట్రాలీలు వాడొద్దని సీఎం యోగి సూచన
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో గత రాత్రి రెండు గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 31 మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ ఘటంపూర్ ప్రాంత సమీపంలో అదుపుతప్పి ఓ చెరువులో పడిపోయింది. ఈఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నావోలోని చంద్రిక దేవి ఆలయ సందర్శన అనంతరం భక్తులు వెనక్కి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందినప్పటికీ ఘటనా స్థలానికి పోలీసులను సకాలంలో పంపడంలో అలసత్వం వహించిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోపే మరో ఘటన జరిగింది. అహిర్వాన్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్ ముందు వెళ్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 26 మంది యాత్రికులు మృతి చెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేలు అందించనున్నట్టు తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ట్రాలీలను వ్యవసాయ పనుల కోసం ఉపయోగిస్తారని, ప్రయాణాలకు వాటిని వాడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


More Telugu News